
ప్రభాస్ తాజా చిత్రం ఫొటో లీక్‌పై యూనిట్ హెచ్చరిక
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్న ప్రభాస్ లుక్ లీక్ అయింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఆ ఫొటో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు షేర్ చేశారు. ప్రభాస్ లుక్ ట్రెండింగ్‌లోకి రావడంతో మూవీ టీమ్ సీరియస్‌గా స్పందించింది.
‘‘మా సినిమా గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీకు అద్భుతమైన విజువల్స్ అందించేందుకు యూనిట్ ఎంతో కష్టపడుతోంది. చిత్రీకరణ సమయంలో సెట్స్ నుంచి ఓ ఫొటో లీక్ అయిన విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి లీక్‌లు మా విశ్వసనీయత, నైతికతను దెబ్బతీస్తాయి. అనధికారికంగా ఎవరైనా ప్రభాస్ లుక్ లీక్ చేసినా, షేర్ చేసినా వాళ్ల ఐడీలు బ్లాక్ చేయడంతో పాటు సైబర్ క్రైమ్ నేరం కింద పరిగణించి కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్.