
కొందరు నటీమణులపై కొన్ని రకాల పాత్రలే చేయగలరనే ముద్ర వేస్తుంటారు. అలా ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితం అనే ముద్ర పడిన నటి పూజాహెగ్డే(Pooja Hegde). అయితే అది తప్పు అని తాజాగా ఈ బ్యూటీ నిరూపించుకున్నారు. అవకాశం వస్తే ఎలాంటి పాత్రనైనా చేయగలనని రెట్రో చిత్రంలో రుక్కుమణిగా జీవించారు. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా కథానాయకి పాత్రలో పూజాహెగ్డే నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించడం విశేషం. ఈమె ఇంతకుముందు గ్లామర్ పాత్రల్లో నటించి కుర్రకారును విపరీతంగా అలరించారు. దీంతో రెట్రో చిత్రంలో నటించడంతో పూజాహెగ్డే నుంచి ఆ తరహా అందాలను ఆశించారు.
అయితే రెట్రో చిత్రంలో రుక్కుమణి పాత్రలో ఆమె నటనను చూసిన అభిమానులు థ్రిల్లయ్యారనే చెప్పాలి. రుక్కుమణి పాత్రలో పూజాహెగ్డే నటించలేదు. పాత్రలో జీవించారు అంటున్నారు. చిత్రంలో చాలా యథార్థ నటనతో ఆకట్టుకున్నారని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎమోషనల్ సన్నివేశాల్లో రుక్కు పాత్రనే కనిపించిందని, ఆమె కనిపించలేదని అభినందిస్తున్నారు. సూర్యతో ప్రేమ సన్నివేశాల్లోనూ, ఆయన నుంచి విడిపోయిన సన్నివేశాల్లోనూ ఆమె నటన అందరినీ ఆకట్టుకుందంటున్నారు. చిత్రం ప్రారంభం నుంచి పూజాహెగ్డే ఒక నటిగా భావించకుండా రుక్కుగా మారి జీవించారని, ఆ పాత్రకే వన్నె తెచ్చారని అంటున్నారు.
చిత్రంలో రుక్కుగా ఆమెకు ఎక్కువగా మాట్లాడలేదని, అయినప్పటికీ తన మౌనం ద్వారా భావాలను అద్భుతంగా పలికించారని, ఆమె కళ్లల్లో బాధ, నమ్మకం, ప్రేమ వంటి భావాలను తన అభినయంతో చక్కగా పండించారంటూ అభినందిస్తున్నారు. మొత్తం మీద రెట్రో చిత్రంలో మరో పూజాహెగ్డే కనిపించారని ప్రశంసలను అందుకుంటున్నారీ బ్యూటీ. కాగా ప్రస్తుతం ఈమె నటుడు విజయ్‌కు జంటగా జననాయకన్ చిత్రంతో పాటు, రాఘవలారెన్స్ సరసన కాంచన–4 చిత్రంలో నటిస్తున్నారు.