ఏ హీరో ఏ దర్శకుడు ఏ నిర్మాత.. ఫ్లాప్ అవ్వాలని సినిమా తీయరు. జనాల్ని అలరించాలనే అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కంటెంట్ లోపమో సరైన సమయంలో రిలీజ్ కాకపోవడమో అనుకున్నన్నీ థియేటర్లు దొరక్కపోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకటి రెండుసార్లు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ తీసిన మూవీస్ తీసినట్లు పోతుంటే ఏమనుకోవాలి? టాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాత ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నారు? ఇంతకీ ఎవరాయన? అసలేం జరుగుతోంది?
పైన చెప్పినందంతా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ గురించే. గత మూడేళ్లలో ఈ సంస్థ నుంచి 15 వరకు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు మూడు తప్పితే మిగతావన్నీ కూడా విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొన్నవే! గతంలో గూఢచారి, కార్తికేయ 2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ సంస్థ.. 2022 డిసెంబరులో 'ధమాకా'తో బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఈ మూవీ కంటెంట్‌పై విమర్శలున్నప్పటికీ కొన్ని అంశాలు కలిసిరావడంతో హిట్ అయిపోయింది. దీని తర్వాత నుంచి ఈ ప్రొడక్షన్ హౌస్‌కి అస్సలు కలిసి రావట్లేదు.
2023లో రిలీజైన సినిమాల్లో పవన్ కల్యాణ్-సాయితేజ్ నటించిన 'బ్రో' ఘోరంగా ఫెయిలైంది. గోపీచంద్ 'రామబాణం', నాగశౌర్య 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', సుమ కొడుకు రోషన్ 'బబుల్‌గమ్' చిత్రాలూ ఫ్లాప్ అయ్యాయి. 2024లో గోపీచంద్ 'విశ్వం', శ్రీ విష్ణు 'స్వాగ్', రవితేజతో 'ఈగల్', 'మిస్టర్ బచ్చన్', నరుడి బ్రతుడు నటన తదితర మూవీస్ వచ్చాయి. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. గతేడాదీ(2025) ఈ నిర్మాణ సంస్థ నుంచి తెలుసు కదా, మనమే, మిరాయ్, మోగ్లీ మూవీస్ వచ్చాయి. వీటిలో తేజ సజ్జా 'మిరాయ్' మాత్రమే హిట్ అయింది. కాస్తోకూస్తో డబ్బులు రాబట్టగలిగింది. మిగిలన వాటి విషయంలో సేమ్ సీన్ రిపీట్.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'రాజాసాబ్' అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పీడకలే మిగిల్చింది. ఎందుకంటే గత రెండు మూడేళ్లలో చాలా సినిమాలతో కోల్పోయిన డబ్బు.. ఈ మూవీతో తిరిగొచ్చేస్తుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆశపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది. రిలీజైన తొలిరోజే ప్రభాస్ చిత్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫలితంగా రన్ ముగిసేసరికి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు.
సాధారణంగా ఒకటో రెండో ఫ్లాపులు వస్తే సరే ఎక్కడో తప్పు జరిగింది అనుకోవచ్చు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయంటే.. తప్పు కాదు పెద్ద పొరపాటే జరుగుతోందని కచ్చితంగా చెప్పొచ్చు. గతంలో నిర్మాత విశ్వప్రసాదే పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేగంగా 100 సినిమాలు చేయడం తమ టార్గెట్ అని అన్నారు. తన టీమే కథలన్నీ వింటుంది అని కూడా చెప్పుకొచ్చారు. బహుశా ఈ తప్పిదాలే ఇన్ని ఫ్లాపులకు కారణమవుతున్నాయా అనే సందేహం కలుగుతోంది!
ప్రస్తుతానికైతే ఈ నిర్మాణ సంస్థ చేతిలో మిరాయ్ 2, జాంబీరెడ్డి 2, రాజుగారి గది 4, కార్తికేయ 3, గూఢచారి 2 తదితర చిత్రాలున్నాయి. వీటిపై కాస్తోకూస్తో హైప్ అయితే ఉంది. మరి వీటితో హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇస్తారా? అనేది చూడాలి?


