
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్' (67) కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన జులై 28న మరణించారు. అయితే, కాస్త ఆలస్యంగా ఆ విషయాన్ని పాయల్ తన సోషల్మీడియా ద్వారా తెలిపింది. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారని ఇదే ఏడాదిలో ఆమె చెప్పిన విషయం తెలిసిందే. తండ్రి మరణంపై ఆమె చాలా ఎమోషనల్ అయింది. క్యాన్సర్తో పోరాడుతున్న తన తండ్రిని కాపాడుకునేందుకు తాను చేయాల్సినవన్నీ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ, తన నాన్నను కాపాడే పోరాటంలో విజయం సాధించలేకపోయానని ఆమె పేర్కొంది. క్షమించండి నాన్న అంటూ పాయల్ ఒక పోస్ట్ చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు.

పాయల్ రాజ్‌పుత్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది. పాయల్ రాజ్‌పుత్ ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు మెసేజ్‌లు పెడుతున్నారు. హీరోయిన్ లక్ష్మిరాయ్, నిర్మాత ఎస్‌కేఎన్ వంటి వారు ఆమెకు సానుభూతి తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. ఇలాంటి సమయంలో మరింత బలంగా ఉండాలని కోరారు.
పాయల్ రాజ్‌పుత్ ‘RX 100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలలో నటించి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వెంకటలచ్చిమి" అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.