
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు.
మూకీ సినిమాలు
ఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.
బాలీవుడ్‌లో రాణించిన తెలుగు వ్యక్తి
మంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్‌పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు.
జీవితంపై డాక్యుమెంటరీ
నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.
చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్