వందేళ్లకు ఆస్కార్‌లో భారీ మార్పులు | Oscars Centinary Changes And Award Event Dates Next Two Years | Sakshi
Sakshi News home page

Oscars: 'ఆస్కార్' రూపు మారబోతోంది

Apr 9 2026 7:04 AM | Updated on Apr 9 2026 8:35 AM

Oscars Centinary Changes And Award Event Dates Next Two Years

ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డు వేడుక మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)వైభవంగా జరిగింది. ఇది జరిగి ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే వచ్చే ఏడాది ఆపై ఏడాది అవార్డు ఈవెంట్స్‌కి సంబంధించిన తేదీలని ఆస్కార్‌ అవార్డు కమిటీ ఫిక్స్‌ చేసింది. ఆ విశేషాలను కమిటీ పంచుకుంది.

2027 మార్చి 14న 99వ, 2028 మార్చి 5న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 15, మార్చి 6) 100వ ఆస్కార్‌ అవార్డు వేడుకలు జరగనున్నాయి. అయితే 2002 నుంచి ఈ అవార్డు వేడుకకు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ఆతిథ్యమిస్తోంది. మధ్యలో 2021లో మాత్రం యూనియన్‌ స్టేషన్ వేదికగా జరిగింది. అది కూడా కరోనా నేపథ్యంలో ఆ వేదిక ప్రాంగణం పెద్దగా ఉంటుందని, సీట్స్‌కి మధ్య చాలా గ్యాప్‌ ఉంచే వీలు ఉంటుందని సేఫ్టీ కోసం ఆ ఏడాది అక్కడ నిర్వహించారు. అది మినహాయిస్తే ఈ ఏడాదితో కలుపుకుని 24 ఏళ్లు డాల్బీ థియేటర్‌లోనే వేడుక నిర్వహించారు. అయితే మరో రెండేళ్లు మాత్రమే ఈ వేదికలో జరపనున్నారు.

99, 100వ ఆస్కార్‌ వేడుకలను డాల్బీ థియేటర్లోనే జరుపుతారు. 2028లో జరగనున్న 'సెంటెనరీ' (వందో) వేడుకను చాలా ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. 2029లో జరపనున్న 101వ వేడుకకు లాస్‌ ఏంజిల్స్‌ డౌన్‌టౌన్‌లోని పీకాక్‌ థియేటర్‌ వేదిక కానుందని తాజాగా అవార్డు కమిటి ప్రకటించింది. కాబట్టి దాదాపు పాతికేళ్లు ఆస్కార్‌ వేడుకకు వేదిక అయిన డాల్బీ థియేటర్‌లో ఇక ఈ వేడుక సందడి కనిపించదు.

ఇప్పటివరకూ ఆస్కార్‌ అవార్డు వేడుకలు ఏబీసీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమయ్యేవి. 99, 100 అవార్డు వేడుకలు కూడా ఇందులోనే వస్తాయి. ఈ ఛానెల్‌లో ప్రసారమయ్యే చివరి వేడుకలు ఇవే. 101వ అవార్డు వేడుక నుంచి మాత్రం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ ప్లాన్ చేస్తున్నారు. 1929లో తొలి ఆస్కార్‌ అవార్డు వేడుక ఎక్కడా ప్రసారం కాలేదు. తర్వాత రేడియోలో ప్రసారమైంది. ప్రతిసారి ఆస్కార్‌ అవార్డు వేడుక 1953లో ఎన్‌బీసీ చానల్‌లో ప్రసారమైంది. తర్వాత కొంత మార్పు జరిగింది. 1976లో ఏబీసీ చానల్‌లో ప్రసారం ఆరంభమైంది. అప్పట్నుంచి రానున్న రెండు అవార్డు వేడుకల వరకూ ఈ ఛానెల్ లోనే ప్రసారాన్ని చేసింది కమిటీ.

దాదాపు 50 ఏళ్ల తర్వాత దీనిని కాదనుకుని 2029 నుంచి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ చేయనుంది. అంటే ఆస్కార్‌ వేడుక ఆరంభమైన వందేళ్లకు ఈ అవార్డు వేడుకలో వచ్చే కొత్త మార్పులంటే..కొత్త వేదిక, యూట్యూబ్‌. 2029లో జరగనున్న 101వ అవార్డు వేడుకలో ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement