
Nushrratt Bharuccha Recalls Her Paranormal Experience: సినిమా అంటేనే ఊహాజనిత ప్రపంచం. మూవీ వరల్డ్‌లో అనేక జానర్స్ ఉంటాయి. అందులో ఒకటి హార్రర్ జానర్. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెట్టి వాళ‍్ల నటనతో భయపెడ్తుంటారు యాక్టర్స్. మరీ అలాంటి భయం యాక్టర్స్‌కు నిజ జీవితంలో ఎదురైతే ? ప్రేక్షకులను వారి సినిమాలతో భయపెట్టిన నటీనటులు ప్రాణ భయంతో పరుగులుపెడితే ! అవును. అలాంటి భయానక ఘటనే జరిగింది ఓ నటికి. బాలీవుడ్ నటీ నుష‍్రత్ భరుచ్చా ప‍్రస్తుతం ఫ్యూరియా దర్శకత్వంలో విడుదలైన 'చోరీ' సినిమాను ప్రమోట్ చేస‍్తోంది. ఈ చిత్రంలో ఆమె 8 నెలల గర్భిణీ సాక్షి పాత్ర పోషించింది. ఈ సినిమా 2017లో విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ హార్రర్ 'లపచ్చాపి' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.
ఈ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన భయానక సంఘటన గురించి చెప‍్పింది నుష్రత్. సినిమా షూటింగ్ కోసం ఢిల్లీలోని ఒక హోటల్‌లో బస చేయాల్సి వచ్చిందట. అప్పుడు తనకు జరిగిన వింత అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 'హోటల్ ఉన్నప్పుడు నాకు కొంచెం విచిత్రంగా తోచింది. నేను నా సూట్‌కేస్‌ను టేబుల్‌పై తెరచి ఉంచి పడుకున్నాను. తెల్లారి లేచి చూసే సరికి నా సూట్‌కేస్ టేబుల్‌పై లేదు. నేలపై ఉంది. అంతేకాకుండా నా బట్టలు చిందరవందరగా నేలపై పడి ఉన్నాయి. అది నేను చేయలేదు. అక్కడ అంతా మాములుగా అనిపించలేదు. నాకు చాలా భయమేసింది. నా ప్రాణాల కోసం పరిగెత్తి 30 సెకన‍్లలో హోటల్ నుంచి బయటపడ్డాను.' అని నుష్రత్ భరుచ్చ తెలిపింది.
నుష్రత్ నటించిన చోరీ నవంబర్ 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. 'సాక్షి, తనకు పుట్టబోయే బిడ్డను దుష్టశక్తులు ఎలా వెంబడించాయి. వాటినుంచి సాక్షి ఎలా పోరాడింది.' అనేది సినిమా కథ.