‘డ్రాగన్’ చూపు నార్త్ ఆఫ్రికాపై పడిందట. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో భాగంగా ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది.
కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ నార్త్ ఆఫ్రికా లొకేషన్స్‌లో... ముఖ్యంగా ట్యూనిషియా దేశంలో జరగనుందని సమాచారం. అక్కడి లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నెలాఖర్లో నార్త్ ఆఫ్రికాకు వెళ్తున్నారని, నవంబరు నెలలో ట్యూనిషియా లొకేషన్స్‌లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందనే టాక్ వినిపిస్తోంది.
నవంబరు మొదటి వారంలో హైదరాబాద్‌లో కొంత చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత అదే నెల చివర్లో ఆఫ్రికా వెళ్లే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. టీ–సిరీస్ ఫిల్మ్స్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్‌ల సమర్పణలో నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.


