ఒక్కో హీరో కోట్లు తీసుకుంటున్నాడు, మాకు పెంచమని అడిగితే.. | Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui: పాతిక కోట్లు ఇచ్చినా అలా చేయను.. బేరాలడితే మొహంమీదే.. సైంధవ్‌ నటుడు

Published Sat, Jan 27 2024 11:08 AM

Nawazuddin Siddiqui: Bollywood Actors Earn Approximately Rs 10 Crore for Film - Sakshi

కథలో దమ్మున్నా సినిమా క్వాలిటీగా రావాలంటే నిర్మాతలు డబ్బులు ధారపోయాల్సిందే! అయితే సినిమా తీయడానికంటే అందులో నటించినవారి కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆ రేంజులో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్‌ పెరిగిపోయింది. హిట్టు పడ్డేకొద్దీ వారు ఇంకా ఎక్కువ డిమాండ్‌ చేస్తూ పోతున్నారు. సినిమా ఫలితాలను బట్టి కొందరు పారితోషికం వెనక్కు ఇచ్చేస్తారు, లేదంటే కొంత కోతలు పెడుతుంటారు. మరికొందరు మాత్రం రిజల్ట్‌ ఎలా ఉన్నా పూర్తి మొత్తం ముట్టాల్సిందేనని కరాఖండిగా చెప్తారు.

ఎంత తీసుకుంటారు?
తాను మాత్రం అలా చేయనంటున్నాడు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు బాలీవుడ్‌లో నటీనటులు, చిన్నపాటి హీరోలు అందుకుంటున్న పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌ నటులు సుమారు ఎంత పారితోషికం తీసుకుంటారు? అన్న ప్రశ్నకు నవాజుద్దీన్‌ స్పందిస్తూ.. చాలా ఎక్కువగా తీసుకుంటారని చెప్పాడు. పది కోట్ల పైనే ఉండొచ్చా? అని యాంకర్‌ అడగ్గా.. పదికోట్లకు అటుఇటుగా తీసుకుంటారని బదులిచ్చాడు.

ఎక్కువ అడిగామంటే అంతే..
రెమ్యునరేషన్‌ విషయంలో బేరాలడతారా? అన్న ప్రశ్నకు తానైతే అలా చేయనని చెప్పాడు. ఇక్కడ నటుల టాలెంట్‌ను బట్టి వారికి ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇస్తారు. లేదు, మాకింకా ఎక్కువ కావాలని అడిగితే.. ఏంటి? మేము చెప్పిన అమౌంట్‌ కన్నా ఎక్కువ తీసుకునే అర్హత నీకుందా? అని మొహం మీదే అనేస్తారు. అందుకే నేను ఎక్కువగా డిమాండ్‌ చేయను, ఇచ్చిందే తీసుకుంటాను. కొన్ని సినిమాలు డబ్బుల కోసమే చేశాను. మరికొన్ని పైసా తీసుకోకుండా ఫ్రీగా చేశాను.

రూ.25 కోట్లు ఇచ్చినా చేయను
నేను చిన్నాచితకా పాత్రలు చేయడం మానేశాను. నాకు రూ.25 కోట్లు ఇస్తామన్నా సరే అటువంటి పాత్రలు చేయను. ఇప్పటికే నా కెరీర్‌లో చాలా సినిమాల్లో చిన్న రోల్స్‌ చేశాను. ఇక చాలు. ఇకమీదట అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్‌ సిద్ధిఖి ఇటీవలే సైంధవ్‌ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సెక్షన్‌ 108 సినిమా చేస్తున్నాడు.

చదవండి: ఫలించిన నిరీక్షణ.. డైహార్ట్‌ ఫ్యాన్‌కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్‌
విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్‌ అయిన మాజీ భర్త చైతన్య

Advertisement
 
Advertisement
 
Advertisement