ఓటీటీలోకి వచ్చేసిన ‘నారాయణ అండ్‌ కో’ | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన ‘నారాయణ అండ్‌ కో’

Published Tue, Sep 5 2023 5:36 PM

Narayana And Co Movie Now Streaming In Amazon Prime Video - Sakshi

సుధాకర్‌  కోమాకుల హీరోగా నటించిన తాజా చిత్రం నారాయణ అండ్‌ కో. ‘ది తిక్కల్ ఫ్యామిలీ'అనేది ట్యాగ్ లైన్.  జూన్‌ 30న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మూవీ కాన్సెప్ట్‌ బాగా ఉందని ప్రశంసలు వచ్చినా ప్రమోషన్లు సరిగా లేకపోవడంతో మూవీ పెద్దగా ఆడలేకపోయింది. దీనికి తోడు ఆ సమయంలో థియేటర్లలో భారీ సినిమాలు ఉండడంతో పోటీ ముందు నిలబడలేకపోయింది. అయితే ఇప్పుడీ ‘నారాయణ అండ్‌ కో మూవీ’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. 

‘నారాయణ అండ్‌ కో’ కథేంటంటే..
నారాయణ(దేవి ప్రసాద్‌), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్‌(సుధాకర్‌ కోమకుల) క్యాబ్‌ డ్రైవర్‌. క్రికెట్‌లో బెట్టింగ్‌ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్‌ (జై కృష్ణ) కెమెరామెన్‌. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్‌ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్‌ బెదిరిస్తాడు.

దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్‌  చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్‌)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్‌ చేస్తే వర్కౌట్‌ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్‌(తోటపల్లి మధు) తరపున ఓ డీల్‌ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్‌ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్‌ ఒప్పుకుంటారు. మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్‌(అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. 

Advertisement

తప్పక చదవండి

Advertisement