
'ముత్యాల ముగ్గు' సినిమా తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్గా నిలిచిపోవడంతో పాటు ఒక సువర్ణ అధ్యాయానికి ప్రారంభమని చెప్పవచ్చు. బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ మాటలతో 1975లో విడుదలైన ఈ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి. ఈ సినిమాకు రావు గోపాలరావు పాత్రనే ఒక ఊపిరి, జీవం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ముత్యాల ముగ్గు సినిమా, సామాజిక సమస్యలను, కుటుంబ సంబంధాలను సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఇందులో సూరపనేని శ్రీధర్, సంగీత, కాంతారావు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, నూతన్ ప్రసాద్ వంటి స్టార్స్ నటించారు.

ముత్యాల ముగ్గు విజయానికి కారణం ఇదే
1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచింది. దర్శకుడు బాపు, రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఎనలేని పేరు తెచ్చింది. నటుడు రావు గోపాలరావు ఈ సినిమాతో దాదాపు 30 ఏళ్ల కెరీర్‌కు తిరుగులేని పునాది వేసుకున్నారు. మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి దృశ్యం కలిస్తే ఒక మంచి సినిమా అవుతుందని‘ముత్యాల ముగ్గు’ నిరూపించింది. స్త్రీని అనుమానించడం రామాయణ కాలం నుంచి ఉంది. నిర్థారణలు లేకుండా ఆమెను కారడవులకు సాగనంపడం ఈ నేటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంది. అనుమానించడం మగవాడి వంతు. శిక్ష వేయడం అతడి అధికారం. కాని అనుమానించిన రాముడే మచ్చను మిగుల్చుకున్నాడు తప్ప సీత కాదు. ముత్యాల ముగ్గులో భర్త మూర్ఖుడుగా మిగిలాడు తప్ప భార్య కాదు. నాటి నుంచి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగే ఉద్వేగాలను పట్టుకోవడం వల్లే ‘ముత్యాల ముగ్గు’ విజయం సాధించింది. ‘లవ కుశ’ స్ఫూర్తితో తయారైన ఈ సినిమా ఆ లవ కుశ మల్లేనే పెద్ద విజయం సాధించింది.

ముత్యాల ముగ్గులో ప్రత్యేకత ఏంటి
లైట్లు వాడకుండా శాటిన్ క్లాత్‌తో ఔట్ డోర్ సన్నివేశాలను అందంగా తీసిన ఇషాన్ అర్యా ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. అంత వరకు లౌడ్ విలనీకి అలవాటు పడ్డ జనానికి రావు గోపాలరావు చూపిన సాఫ్ట్ విలనీ ఒక ఫ్యాక్టర్. కుత్తుకలు కోసే వాడు కూడా మామూలు మనిషిలానే ఉంటాడని అతడికీ కళాపోషణ ఉంటుందని అతడూ తన కూతురిని ప్రాణం కంటే మిన్నగా పోషిస్తాడని ఈ సినిమా చూపించి ప్రేక్షకులను షాక్ చేసింది. ‘అలో అలో అలో’... ‘ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదూ’... ‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు’ వంటి గొప్ప డైలాగులు రాసిన ముళ్లపూడి వెంకట రమణ రచన ఒక ఫ్యాక్టర్. ఇక ప్రతి దృశ్యాన్ని ఒక పెయింటింగ్‌లా చూపించిన బాపు దర్శకత్వం మరో ఫ్యాక్టర్.
ఈ సినిమాలో మనుషులతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఒక పాత్ర పోషిస్తాడు. సీతమ్మనురాముడితో కలిపిన హనుమంతుడు ఈ సినిమాలో పిల్లల ఊహలలో ఆలంబనగా నిలిచి వారికే కాదు ప్రేక్షకులకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనకు ప్రతీకగా ఒక కోతి పిల్లల భుజాల మీద ఎప్పుడూ ఉంటుంది. అదే సినిమాలో అల్లు రామలింగయ్యను శిక్షిస్తుంది. రాముడి నగలను కాజేయ బోయిన అల్లు రామలింగయ్య మీద కోతి దాడి చేస్తుంది. అప్పటి నుంచి అతడికి అందరూ కోతుల్లాగా కనిపించే మానసిక జాడ్యం వస్తుంది. ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చేసిన అల్లు రామలింగయ్య చప్పట్లు కొట్టించుకుంటారు. అలాగే కనిపించేది కొన్ని క్షణాలే అయినా ‘కాలుకెంత చేయికెంత కాలేజీ సీటుకెంత కన్సెసన్ ఏమైనా ఉందా?’ అంటూ చిటికెలు వేస్తూ మాడ వెంకటేశ్వరరావు కూడా అందరికీ గుర్తుండిపోతాడు.
అన్నట్టు ఈ సినిమాను ఎన్.టి.రామారావు చూసి సంగీత, శ్రీధర్‌ల మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ ‘మా పెళ్లిరోజులు గుర్తొచ్చాయి బ్రదర్’ అని ముళ్లపూడితో అన్నారట.‘ముత్యాల ముగ్గు’లాంటి సినిమాలు పదే పదే సంభవించవు. సంభవించినవి కలకాలం నిలుచుండిపోతాయి. ఇన్నాళ్ల తర్వాత ముత్యాల ముగ్గు గురించి మనం మాట్లాడుకుంటున్నది అందుకే.
ఈ డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్
ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వాటిని తూర్పు గోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.
సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ
ఆకాసంలో!....సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ?
ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల.
ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
వాడికి స్త్రీజాతిమీద నమ్మకం పోయింది. నాకు మనుషులమీదే నమ్మకంపోయింది. (ముక్కామలతో కాంతారావు)
సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. ( కాంతారావుతో సంగీత)