breaking news
Mutyala Muggu movie
-
'మడిసన్నాక కూసంత కలాపోసనుండాల'.. నేటికీ ఈ డైలాగ్స్ ఫేమస్
'ముత్యాల ముగ్గు' సినిమా తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోవడంతో పాటు ఒక సువర్ణ అధ్యాయానికి ప్రారంభమని చెప్పవచ్చు. బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ మాటలతో 1975లో విడుదలైన ఈ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి. ఈ సినిమాకు రావు గోపాలరావు పాత్రనే ఒక ఊపిరి, జీవం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ముత్యాల ముగ్గు సినిమా, సామాజిక సమస్యలను, కుటుంబ సంబంధాలను సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఇందులో సూరపనేని శ్రీధర్, సంగీత, కాంతారావు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, నూతన్ ప్రసాద్ వంటి స్టార్స్ నటించారు.ముత్యాల ముగ్గు విజయానికి కారణం ఇదే1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచింది. దర్శకుడు బాపు, రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఎనలేని పేరు తెచ్చింది. నటుడు రావు గోపాలరావు ఈ సినిమాతో దాదాపు 30 ఏళ్ల కెరీర్‌కు తిరుగులేని పునాది వేసుకున్నారు. మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి దృశ్యం కలిస్తే ఒక మంచి సినిమా అవుతుందని‘ముత్యాల ముగ్గు’ నిరూపించింది. స్త్రీని అనుమానించడం రామాయణ కాలం నుంచి ఉంది. నిర్థారణలు లేకుండా ఆమెను కారడవులకు సాగనంపడం ఈ నేటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంది. అనుమానించడం మగవాడి వంతు. శిక్ష వేయడం అతడి అధికారం. కాని అనుమానించిన రాముడే మచ్చను మిగుల్చుకున్నాడు తప్ప సీత కాదు. ముత్యాల ముగ్గులో భర్త మూర్ఖుడుగా మిగిలాడు తప్ప భార్య కాదు. నాటి నుంచి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగే ఉద్వేగాలను పట్టుకోవడం వల్లే ‘ముత్యాల ముగ్గు’ విజయం సాధించింది. ‘లవ కుశ’ స్ఫూర్తితో తయారైన ఈ సినిమా ఆ లవ కుశ మల్లేనే పెద్ద విజయం సాధించింది.ముత్యాల ముగ్గులో ప్రత్యేకత ఏంటిలైట్లు వాడకుండా శాటిన్ క్లాత్‌తో ఔట్ డోర్ సన్నివేశాలను అందంగా తీసిన ఇషాన్ అర్యా ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. అంత వరకు లౌడ్ విలనీకి అలవాటు పడ్డ జనానికి రావు గోపాలరావు చూపిన సాఫ్ట్ విలనీ ఒక ఫ్యాక్టర్. కుత్తుకలు కోసే వాడు కూడా మామూలు మనిషిలానే ఉంటాడని అతడికీ కళాపోషణ ఉంటుందని అతడూ తన కూతురిని ప్రాణం కంటే మిన్నగా పోషిస్తాడని ఈ సినిమా చూపించి ప్రేక్షకులను షాక్ చేసింది. ‘అలో అలో అలో’... ‘ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదూ’... ‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు’ వంటి గొప్ప డైలాగులు రాసిన ముళ్లపూడి వెంకట రమణ రచన ఒక ఫ్యాక్టర్. ఇక ప్రతి దృశ్యాన్ని ఒక పెయింటింగ్‌లా చూపించిన బాపు దర్శకత్వం మరో ఫ్యాక్టర్.ఈ సినిమాలో మనుషులతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఒక పాత్ర పోషిస్తాడు. సీతమ్మనురాముడితో కలిపిన హనుమంతుడు ఈ సినిమాలో పిల్లల ఊహలలో ఆలంబనగా నిలిచి వారికే కాదు ప్రేక్షకులకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనకు ప్రతీకగా ఒక కోతి పిల్లల భుజాల మీద ఎప్పుడూ ఉంటుంది. అదే సినిమాలో అల్లు రామలింగయ్యను శిక్షిస్తుంది. రాముడి నగలను కాజేయ బోయిన అల్లు రామలింగయ్య మీద కోతి దాడి చేస్తుంది. అప్పటి నుంచి అతడికి అందరూ కోతుల్లాగా కనిపించే మానసిక జాడ్యం వస్తుంది. ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చేసిన అల్లు రామలింగయ్య చప్పట్లు కొట్టించుకుంటారు. అలాగే కనిపించేది కొన్ని క్షణాలే అయినా ‘కాలుకెంత చేయికెంత కాలేజీ సీటుకెంత కన్సెసన్ ఏమైనా ఉందా?’ అంటూ చిటికెలు వేస్తూ మాడ వెంకటేశ్వరరావు కూడా అందరికీ గుర్తుండిపోతాడు.అన్నట్టు ఈ సినిమాను ఎన్.టి.రామారావు చూసి సంగీత, శ్రీధర్ల మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ ‘మా పెళ్లిరోజులు గుర్తొచ్చాయి బ్రదర్’ అని ముళ్లపూడితో అన్నారట.‘ముత్యాల ముగ్గు’లాంటి సినిమాలు పదే పదే సంభవించవు. సంభవించినవి కలకాలం నిలుచుండిపోతాయి. ఇన్నాళ్ల తర్వాత ముత్యాల ముగ్గు గురించి మనం మాట్లాడుకుంటున్నది అందుకే. ఈ డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వాటిని తూర్పు గోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూఆకాసంలో!....సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ?ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల.ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.వాడికి స్త్రీజాతిమీద నమ్మకం పోయింది. నాకు మనుషులమీదే నమ్మకంపోయింది. (ముక్కామలతో కాంతారావు)సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. ( కాంతారావుతో సంగీత) -
అనారోగ్యంతో 'ముత్యాలముగ్గు' నటుడు మృతి
రంగస్థలం కళాకారుడు, నటుడు పి. వెంకటేశ్వర రావు(90) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య లక్ష్మీ, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పి.వెంకటేశ్వర రావు పూర్తిపేరు పిసుపాటి వేంకటేశ్వర రావు. తొలుత రంగస్థలం కళాకరుడిగా పరిచయం అయిన ఆయన తేనె మనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కన్నెమనసులు, ఆత్మీయులు, మరోప్రపంచం, సుడిగుండాలు, మట్టిలో మాణిక్యం, ముత్యాలముగ్గు వంటి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. గతంలో ఇదేమిటి అనే నాటకంలో నటించి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకున్నారు. -
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
చిత్రం: ముత్యాలముగ్గు రచన: గుంటూరు శేషేంద్ర శర్మ గానం: పి. సుశీల సంగీతం: కె. వి. మహదేవన్ బాపురమణల సారథ్యంలో రూపొందిన ‘ముత్యాల ముగ్గు’. విడుదలై నాలుగు న్నర దశాబ్దాలు కావస్తున్నా ఆ చిత్రంలోని మాటలు పాటలు పచ్చతోరణాలుగా తెలుగువారి మనసులో రెపరెపలాడుతూనే ఉన్నాయి, నిత్య నూత నంగా నిలిచాయి. ఇందులో గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన అధివాస్తవిక గీతం ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది’ జనసామాన్యంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ పాట చాలామంది అనుకున్నట్టు చిత్రం కోసం సందర్భానికి తగినట్టు కూర్చిన సాహిత్యం కాదు. అంతకుముందెప్పుడో ఒక వారపత్రికలో కవితగా వెలువడింది. ‘ముత్యాలముగ్గు’ చిత్రానికి నిర్మాతగా యమ్వీయల్ పేరు వుంటుంది. ఆయన నూజివీడు రాజావారి కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులు. సుకుమార్ రాజా (రాజావారి వారసులు) యమ్వీయల్ గారి విద్యార్థి. సుకుమార్ బాపురమణలతో సినిమా తియ్యాలను కున్నప్పుడు యమ్వీయల్ సంధానకర్తగా వున్నారు. ఆయన శేషేంద్రకి అభిమాని, అంతకుమించి సాహిత్యాభిమాని. బాపు రమణలతో కథా చర్చలు జరిగేప్పుడే ఈ పాటను యమ్వీయల్ సూచించారు. సినిమాలో చక్కగా అమరింది. అనుమానంతో ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా పంపివేయబడిన కథానాయిక, తన ఇద్దరు పిల్లలతో వాల్మీకి ఆశ్రమంలాంటి చోట తల దాచుకుంటుంది. భర్త ఎక్కడో రాజమహల్లో వుంటాడు. యాదృచ్ఛికంగా లాంచీ మీద, కథానాయిక ఉండే రేవు మీదుగా కథా నాయకుడు దాటి వెళ్లే నేపథ్యంలో కథా నాయిక మనస్థితిని విప్పిచెప్పే పాటగా నడుస్తుంది. రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది/దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది/శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది/ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది’ అనే పదాలు... ఆ సన్నివేశాన్ని బాపురమణలు ఈ పాట కోసమే సృష్టించారా అనిపించేలా అమరాయి. అందుకే ఇది శేషేంద్ర సినిమాకి రాసిన పాట అనుకుంటారు. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో/ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి/కొమ్మల్లో పక్షుల్లారా/గగనంలో మబ్బుల్లారా/నది దోచుకు పోతున్న నావను ఆపండి/రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’ – అంటూ కథానాయిక బావురు మంటుంది. శేషేంద్ర లాంటి మహానుభావుడు సర్రియ లిస్టిక్ ధోరణిలో నిగూఢ భావాలతో రాసిన ఈ గేయాన్ని ముత్యాలముగ్గులో సంద ర్భోచితంగా పొదిగి పాటకి బాపురమణలు వన్నె తెచ్చారు. జనం మెచ్చారు. శేషేంద్ర సవ్యసాచి! – సంభాషణ: వైజయంతి పురాణపండ -
సినిమా తోటలోకి కొత్త పాట ఒకటి వచ్చింది!
పాటతత్వం పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు... సినిమా పాటల్లో ఆ లక్షణాలు బొత్తిగా లేని పాటలు కొన్ని అరుదుగానే వచ్చాయి. అలాంటి అరుదైన పాటల్లో ఓ ఆణిముత్యం ‘ముత్యాల ముగ్గు’ చిత్రంలోని చివరి పాట. ఇది విద్వత్కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఏకైక చలనచిత్ర గీతం కావడం విశేషం! ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాలను మధించి ముప్ఫైకి పైగా కావ్యాలను, విమర్శనగ్రంథాలను రచించిన శేషేంద్ర సాహిత్య సంపద అంతా ఒక ఎత్తయితే ఈ పాట ఒక్కటీ ఒక ఎత్తనడం అతిశయోక్తి కాదేమో! ఈ ఒక్క పాటతో ఆయన తెలుగు సినీ గేయసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరును సంపాదించారు. జనసామాన్యానికి పాట గుర్తున్నంతగా ఆయన ‘శేషజ్యోత్స్న’, ‘మండే సూర్యుడు’, ‘గెరిల్లా’ ఇత్యాది కావ్యాలు గుర్తుండవు. అది సినిమా మాధ్యమం మహిమ కూడా కావచ్చు! శేషేంద్రగారి చేత ఈ పాట రాయించాలని ప్రతిపాదించిన కవితాప్రియుడు ‘మెలోడియస్ వాయిస్ ఆఫ్ లిటరేచర్’ అని పేరు పడిన ‘ముత్యాల ముగ్గు’ నిర్మాత ఎమ్వీయల్. ‘ముత్యాల ముగు’్గ ఔట్‌డోర్ షూటింగ్ జరిగిన ప్రాంతాల్లో ఇందిరా ధనరాజ్‌గిరి గారి ‘జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్’ ఒకటి కావడం కూడా ఈ ప్రతిపాదనకు దోహదం చేసి ఉండవచ్చు. బాపు దర్శకత్వాన్ని, ముళ్లపూడి వెంకటరమణ రచనను, కె.వి.మహదేవన్ సంగీతాన్ని, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణ దర్శకత్వాన్ని నిర్వహించగా ఆరుద్ర, సినారె, శేషేంద్ర శర్మ పాటలు సమకూర్చగా, మొదట్లో శ్లోకాన్ని, పాటను మంగళంపల్లి వారు ఆలపించగా దృశ్యకావ్యంలా రూపుదిద్దుకున్న ఈ కళాఖండానికి మొదటివారం ప్రేక్షకులు కరవయ్యారట! ఉత్తర రామాయణానికి సాంఘిక రూపమే ‘ముత్యాల ముగ్గు’ ఇతివృత్తం. సీతారాముల్లాంటి ఆదర్శదంపతులు లక్ష్మి శ్రీధర్‌లు. సినిమా కథ ప్రకారం లక్ష్మి, శ్రీధర్ల వివాహం కాకతాళీయంగా జరుగుతుంది. లక్ష్మి శ్రీధర్ మిత్రుని చెల్లెలు. లక్ష్మి వివాహం ఒక మోసగాడితో నిశ్చయమవుతుంది. ఆ పెళ్లికి తన తండ్రి తరఫున సహాయం అందించడానికి శ్రీధర్ వెళ్తాడు. వరుడు నిత్య పెళ్లి కొడుకని తెలిసి అతని అరెస్ట్‌తో పెళ్లి ఆగిపోవడంతో అపవాదుపాలయిన లక్ష్మి మెళ్లో మూడు మూళ్లు వేస్తాడు శ్రీధర్. ఆ గతాన్ని తలచుకొని తనను ఆపదలో ఆదుకొని జీవితభాగస్వామిని చేసుకున్న ఉన్నత సంస్కారం గల శ్రీధర్ తన జీవితంలో అనూహ్యంగా ఓ పాటలా అడుగు పెట్టి తనకు ఓదార్పును, కమ్మని కలలాంటి బతుకును ఇచ్చాడని- ఆమె మనసు తన అదృష్టానికి మురిసిపోతుంది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది అనే మొదటి చరణంలో శ్రీధర్ సాంగత్యంలో చిగురు తొడిగిన లక్ష్మి జీవితాన్ని కవి హృద్యంగా చెప్పారు. లక్ష్మి పెట్టిన రంగవల్లులను శ్రీధర్ తన్మయంతో తిలకించడం, దీపాలు వెలిగించుకోవడానికి అనువైన గూళ్లతో కూడిన తులసికోట ముందు లక్ష్మి పరవశమై నిలబడడం వంటి దృశ్యాలు కవి భావనకు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు ఇచ్చిన సహకారాన్ని తెలియజేస్తాయి. ఆలుమగల అన్యోన్యత శూన్యమైన వేణువుకు స్వరాలు ఒదిగినట్టుగా ఉందనడం, లక్ష్మి వైవాహిక జీవితాన్ని శిశిరానికి వీడ్కోలు చెప్పిన వసంతంలా భావించడం... మామూలు సినిమా పాటలకు భిన్నమైన రమణీయమైన భావచిత్రాలు! ‘విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినబడి, అంతలో పోయాయి...’ అనే పంక్తులు సహృదయులకు రసస్పందనను కలిగిస్తాయి. నిరాశామయ జీవితాన్ని గడుపుతున్న లక్ష్మి హృదయంలో ఆశ ఎలా దోబూచులాడిందో కవి ఎంత ఆర్ద్రంగా చెప్పాడు! ‘కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా నది దోచుకు పోతున్న నావను ఆపండి రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’... అనే ముక్తాయింపు గుండెలను పిండేస్తుంది. మానవసహాయం అందదని తెలిసి సీతాదేవిలాగే నాయిక ప్రకృతికి మొరపెట్టుకుంటుంది. దూరమవుతున్న నావను నది దోచుకుపోవడంగాను, మెరుపులా మెరిసి మాయమైన మనిషి కోసం అలమటిస్తున్న నాయిక ఆవేదనను రేవు విలపిస్తున్నట్టుగాను ఊహించడం కవి భావుకతకు పరాకాష్ఠ! నిజానికి ఈ పాటను శర్మగారు ఇంకా దీర్ఘంగా రాశారని, సినిమా పాట కొలతను దృష్టిలో పెట్టుకొని దానిని సంక్షిప్తీకరించామని ఎమ్వీయల్ చెప్పారు. ఎడిట్ చేసిన భాగంలో ఎన్ని అందాలు జారిపోయాయో మరి! జీవనసత్యాన్ని వెల్లడించే తాత్విక ప్రధానమైన గీతం కనుక, ఈ శీర్షికలో విశ్లేషణకు దీనిని ఎంచుకున్నాను. జీవితం చీకటి వెలుగుల, ఆశ నిరాశల ఊగిసలాట అనీ, సహనం వహిస్తే మంచికి అంతిమ విజయం లభిస్తుందని ఆశావహ దృక్పథంగల ఈ గీతానికి కవితాత్మ తోడు కావడం పూవుకు తావి అబ్బినట్లయింది. ఇది నిదురించిన సినిమా తోటలోకి దారి తప్పి వచ్చిన కమ్మని కలలాంటి పాటే! - పైడిపాల సినీగేయ సాహిత్య పరిశోధకులు