
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఒక కంపెనీకి సంబంధించి పెట్టుబడుటు పెట్టేందుకు తన నుంచి రూ. 60 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్థిక నేరాల విభాగానికి (EOW) చెందిన అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం శిల్పాశెట్టి దంపతుల ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మూతబడిన ఆ కంపెనీ ఆడిటర్‌ను కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు దేశం విడిచిపోకుండా ఉండేందుకు వారికి లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారని తెలుస్తోంది.
2015- 2023 సమయంలో షాపింగ్ ప్లాట్‌ఫామ్ బెస్ట్ డీల్ టీవీ కంపెనీకి డైరెక్టర్స్గా శిల్పాశెట్టి దంపతులు ఉన్నారు. అయితే, వ్యాపార విస్తరణలో భాగంగా పెట్టుబడులు పెట్టాలని దీపక్ కొఠారిని కోరడంతో అతను రూ. 60 కోట్ల మేరకు నిధులు వారికి అందించాడు. ఇదే విషయాన్ని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీలో ఎక్కువ వాట ఉన్న శిల్పాశెట్టి 2016లో హామీ కూడా ఇచ్చారన్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం.. ఆ తర్వాత ఆ కంపెనీ దివాలా కూడా తీయడం జరిగిందని చెప్పారు.