
తేజ సజ్జా (Teja Sajja), మంచు మనోజ్ (Manchu Manoj) కాంబినేషన్‌లో తాజాగా విడుదలైన చిత్రం మిరాయ్... కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మిరాయ్‌లో ఈ మూడు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా బాగుందని ఇప్పటికే సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇందులోని విజువల్స్ ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. అయితే, మిరాయ్ కోసం తేజ సజ్జా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది..? అనే చర్చ జరుగుతుంది.
సినిమా హిట్ అయితే.. రెమ్యునరేషన్‌పై తేజ
మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కోసం రూ. 60 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ ఔట్ పుట్ చూస్తే మాత్రం సుమారు. 200 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉంటారనిపించేలా ఉంటుంది. అందరూ మిరాయ్ కోసం తేజ సజ్జా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని భావించినా, వాస్తవం కొంచెం భిన్నంగా ఉన్నట్లు సమాచారం.
తేజా స్వయంగా చెప్పిన ప్రకారం, హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌నే మిరాయ్‌కు కూడా తీసుకున్నానని ఒక వేదికపై చెప్పారు. అయితే, ప్రొడ్యూసర్ మీద తనకున్న నమ్మకం వల్ల, సినిమా హిట్ అయితే మంచి అమౌంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అది కేవలం నిర్మాత ఇష్ట ప్రకారంగా తీసుకునే నిర్ణయం మాత్రమేనని అన్నారు. హనుమాన్ హిట్ అయిన తర్వాత కూడా తాను ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడగలేదన్నారు. ఆ సినిమా నిర్మాతల నుంచి కూడా తనకు రెమ్యునరేషన్ మించి ఒక్క రూపాయి కూడా అదనంగా అందలేదని సమాచారం.
మనోజ్‌కే ఎక్కువ రెమ్యునరేషన్
హనుమాన్ కోసం తేజ సజ్జా రూ. 2 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతంలో తేజ చెప్పిన ప్రకారం మిరాయ్ సినిమాకు కూడా రూ. 2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు అర్థం అవుతుంది. అయితే, ఇకనుంచి ఆయన నటించనున్న కొత్త సినిమాలకు సుమారు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్.. హనుమాన్ సినిమా కంటే ముందే మిరాయ్‌తో తేజ సజ్జా ఒప్పందం చేసుకున్నారు. కానీ, తనకు కథ నచ్చితే రెమ్యునరేషన్ పెంచబోనని కూడా తేజ చెప్పడం విశేషం. మంచు మనోజ్ కూడా మిరాయ్ సినిమా కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రియ మాత్రం రూ. 2 కోట్ల వరకు అందుకున్నారని టాక్.. అయితే, ఇందులో హీరోయిన్‌గా అద్భుతంగా మెప్పించిన రితిక నాయక్ మాత్రం రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం ఉంది.