మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌లను ఎవరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారు. వాటిని పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలలో కొందరు వైరల్ చేశారు. ఈ విషయం చిరు దృష్టికి చేరడంతో ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ముఖ్యంగా AI మార్ఫింగ్ ద్వారా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించి తన పేరు, ప్రతిష్ట దెబ్బతీసేలా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరు కోరారు.
డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్దిరోజుల క్రితమే సివిల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చిరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలను తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వినియోగించవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలోనే AI ద్యారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధిస్తూ సైబర్‌క్రైమ్ పోలీసులుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి పైగానే నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


