
సినిమా ఎల్లలు దాటి చాలా కాలమైంది. అది సినీ తారలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లకు ప్రయోజనంగా మారింది. ఒక భాషల్లో అవకాశాలు తగ్గాయనుకుంటే వెంటనే మరో భాష నుంచి పిలుపు వస్తోంది. నటి మీనాక్షిచౌదరికి అలాంటి అదృష్టమే పట్టిందిప్పుడు. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేసిన ఈ అమ్మడికి ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. చివరిగా ఈమె తెలుగులో నటించిన సంక్రాంతికి వస్తున్నాం మంచి విజయాన్ని సాధించింది. దీంతో మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే అలాంటి పరిస్థితి రాలేదు. ఇక తమిళంలోకి విజయ్ ఆంటోని హీరోగా నటించిన కొలై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత సింగపూర్ సెలూన్, విజయ్‌కు జంటగా ది గోట్ చిత్రాల్లో నటించారు.

విజయ్‌కు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడు బాగా ప్రచారం పొందారు. కానీ, చిత్రంలో ఆమె పాత్ర మాత్రం పరిమితమే అయ్యింది. దీంతో ఇక్కడ కూడా అవకాశాలు అడుగంటాయి. అలాంటిది తాజాగా మరో లక్కీఛాన్స్ వరించిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. ఈయన నటించి, దర్శకత్వం వహించిన ఇడ్లీకడై చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం హిందీ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ధనుష్ పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ధనుష్ నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం.
దీని తరువాత అమరన్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన 55వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని గోపురం ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో ధనుష్‌కు జంటగా నటి మీనాక్షిచౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అదే విధంగా ఒక హిందీ చిత్రంలోనూ మీనాక్షిచౌదరి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.