
అందం, అమాయకత్వం కలబోసినట్లు ఉంటుంది హీరోయిన్ మీనా (Actress Meena). బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తర్వాత హీరోయిన్‌గా దక్షిణాది భాషల్లో అనేక సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తాజాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ సౌందర్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.
క్యాంపెయిన్‌కు నన్నూ పిలిచారు
సౌందర్య, నేను చాలా క్లోజ్. తను చాలా మంచి అమ్మాయి. ప్రచారానికి వెళ్లి చనిపోవడం బాధాకరం. నిజానికి ఆ క్యాంపెయిన్‌కు నన్ను కూడా రమ్మని పిలిచారు. అప్పుడు నేను షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. పైగా ప్రచారాలపై నాకంత ఆసక్తి కూడా లేదు. అందుకే నాకు కుదరదని చెప్పి వెళ్లలేదు. లేకపోయుంటే తనతోపాటు నేనూ వెళ్లాల్సింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తనను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది.
భర్తను కోల్పోయిన బాధలో..
మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ 28న కన్నుమూశారు. ఆ సమయంలో తనపై వచ్చిన రూమర్స్ చూసి మరింత బాధేసిందని పేర్కొంది. నా భర్తను కోల్పోయినప్పుడు ఎంతో బాధపడ్డా.. రెండేళ్లపాటు ఆ బాధ నుంచి బయటపడలేకపోయా.. నా ఫ్రెండ్స్ ఆ విషాదం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు. అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా లక్కీ.
మళ్లీ పెళ్లంటూ రూమర్స్
అయితే నా భర్త చనిపోయిన వారానికే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని వార్తలు రాశారు. వీళ్లకసలు మనసుండదా? ఫ్యామిలీ ఉండదా? అనిపించింది. తర్వాత కూడా ఈ రూమర్స్ కొనసాగించారు. ఎవరికి విడాకులైనా వారితో నా పెళ్లి జరగబోతోందని రాశారు. బాధలో ఉన్న నన్ను మరింత బాధపెట్టారు అని తెలిపింది. కాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో జీ5లో స్ట్రీమ్ అవుతోంది.