
సన్నగా ఉంటే అస్థి పంజరంలా ఉన్నావని, బొద్దుగా ఉంటే బాగా లావైపోయావని ఏదో ఒకరకంగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. తనను కూడా ఇలాంటి కామెంట్లతో బాడీ షేమింగ్ చేశారంటోంది మలయాళ హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొందరు అదే పనిగా ఏదేదో వాగుతారు. ఏం చేస్తున్నావ్? ఇలా అయిపోతున్నావ్? అని కామెంట్లు చేస్తుంటారు.

లెక్క చేయట్లే
మొదట్లో ఫీలయ్యేదాన్ని. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. కానీ ఇప్పుడవేవీ పట్టించుకోవడం లేదు. ఇలా ధృడంగా మారడానికి నాకు చాలా సమయం పట్టింది. ఒకసారేమైందంటే.. చాలాదూరం ప్రయాణించి విమానాశ్రయంలో దిగాను. ఇంతలో సడన్‌గా నాకు పరిచయమే లేని వ్యక్తి ఎదురొచ్చి.. ఏంటి? ఇంత లావైపోయావ్? అన్నాడు.

షాకయ్యా
అందరి ముందు సడన్‌గా అలా అనేసరికి షాకయ్యాను. తర్వాత ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాను. ఇలాంటివి జరిగినప్పుడు మనసుకు కష్టంగా అనిపించేది. కానీ, ఒకానొక సమయంలో ఈ బాధను అధిగమించాను. ఇప్పుడలాంటి కామెంట్లను పట్టించుకోవడమే మానేశాను అని చెప్పుకొచ్చింది.
సినిమా
అపర్ణ బాలమురళి 2015లో ఒరు సెకండ్ క్లాస్ యాత్ర అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సూరరై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. మలయాళంలో సండే హాలీడే, 2018, ధూమం, రుధిరం వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 8 తొట్టకాల్, వీట్ల విశేషం, రాయన్ సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తోంది.
చదవండి: 'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ..