దండోరా సినిమాకు నాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా గద్దర్ అవార్డు లభించడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రేక్షకులకు మరింత మంచి సంగీతం ఇచ్చేందుకు ఈ అవార్డు స్ఫూర్తినిస్తుంది. అలాగే సంగీత దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను అని చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్.
గద్దర్ అవార్డు
ది ఘోస్ట్, మల్లేశం, జాంబిరెడ్డి, ఏజెంట్, సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలకు సంగీతం అందించి తన ప్రతిభ నిరూపించుకున్నారు. దండోరా సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న మార్క్ కె.రాబిన్ విలేకరులతో మాట్లాడుతూ.. నాకు బాల్యం నుంచే సంగీతం అంటే ఇష్టం. కొంతకాలం టీచర్‌గా పని చేశాను. లిరిసిస్ట్ కృష్ణకాంత్ నాకు మంచి మిత్రుడు.
నానికి నచ్చడంతో..
దర్శకనిర్మాత ప్రశాంత్ వర్మ, కృష్ణకాంత్, నేను తరచూ కలుస్తుండేవాళ్లం. అలా నేను, ప్రశాంత్ కలిసి ఇన్ ది డార్క్ అనే ఇండియా ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిలిం చేశాం. ఆ తర్వాత నానిగారి మజ్ను మూవీ ట్రైలర్‌కు ఆర్‌ఆర్ అందించాను. ఈ మ్యూజిక్ నానిగారికి నచ్చడంతో అ..! చిత్రానికి అవకాశం కల్పించారు.
అదే నా కోరిక
అలా మ్యూజిక్ డైరెక్టర్‌గా నా ప్రయాణం మొదలైంది. భావోద్వేగంతో నిండిన మనసుతోనే దండోరాకి సంగీతాన్ని అందించాను. చిరంజీవిగారితో సినిమా చేయాలన్నదే నా ఆకాంక్ష. సంగీతం విషయంలో మనం ఇప్పటికీ చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ప్రస్తుతం కథాకళి, రాజాది రాజా సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మగారితో రెండు సినిమాలు చేస్తున్నాను. హిందీలో సైఫ్ అలీఖాన్‌గారితో ఓ మూవీ చేయాల్సింది కానీ కుదర్లేదు. అదే విధంగా ఒక స్టార్ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు.


