Mammootty: నా తప్పును గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.. మమ్ముట్టి క్షమాపణలు

 Mammootty apologizes for his remarks on director Jude Anthany  - Sakshi

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. తన తప్పును తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసలు విషయమేమిటంటే.. 2018లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా  2018 పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ శాంతి ఓషాన' సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న జూడో ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మూవీ టీజర్ విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మమ్ముట్టి దర్శకుడిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. ఈవెంట్‌లో దర్శకుడి హెయిర్‌ స్టైల్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మమ్ముట్టి మాట్లాడుతూ..'జూడ్ ఆంథోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా, అసాధారణమైన మెదడు కలిగిన అత్యుత్తమ ప్రతిభావంతుడైన దర్శకుడు' అని అన్నారు. దీంతో దర్శకుడిని బట్టతల వ్యక్తి అంటూ అవమానించారని నెటిజన్లు భావించారు. ఇలా మాట్లాడడం బాడీ షేమింగ్‌తో సమానమంటూ పోస్టులు చేశారు. 

దీనిపై మమ్ముట్టి క్షమాపణలు చెబుతూ.. తన అధికారిక సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. 'డియర్ ఆల్‌.. దర్శకుని ప్రశంసించేందుకు నేను వాడిన కొన్ని పదాలు మిమ్మల్ని బాధపెట్టాయని తెలిసింది. ఉత్సాహంతో అలాంటి మాటలు మాట్లాడినందుకు క్షమించండి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతా. ఈ తప్పును గుర్తుచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టి చేసిన తప్పును వెంటనే అంగీకరించి వెంటనే సోషల్ మీడియా పోస్ట్‌తో క్షమాపణలు చెప్పినందుకు నెటిజన్లు ఇప్పుడు మమ్ముట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top