ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది వారసులు అనగానే మెగా లేదంటే నందమూరి ఫ్యామిలీలే గుర్తొస్తాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి హీరోలు ఉన్నప్పటికీ వేళ్లపై లెక్కపెట్టేంత మంది ఉన్నారు. త్వరలో ఈ లిస్టులోకి ఘట్టమేనేని కుటుంబం కూడా చేరనుంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు వరకు వారసులు.. రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: 'బాహుబలి', 'మాస్ జాతర' కోసం సైడ్ అయిపోయిన హీరో)
సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా రమేశ్ బాబు, మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ రమేశ్ బాబు పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. మహేశ్ బాబు మాత్రం స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. మహేశ్ అక్క మంజుల పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు తప్పితే హీరోయిన్ కాలేకపోయారు.
తర్వాత తరానికి వస్తే.. మహేశ్ బాబు చెల్లి ప్రియదర్శని భర్త సుధీర్ బాబు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గల్లా జయదేవ్ కొడుకు అంటే మహేశ్‌కి మేనల్లుడు అశోక గల్లా కూడా హీరోగా రెండు మూడు మూవీస్ చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. వీళ్ల కాకుండా ఇప్పుడు తర్వాత తరం కూడా చాలామంది సిద్ధమైపోయారు. కొందరు అవుతున్నారు.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
ముందుగా మహేశ్ కొడుకు గౌతమ్ విషయానికొస్తే ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఎంట్రీ ఉండొచ్చు. కూతురు సితార ఇప్పటికే తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసింది. సినిమాల్లోని పాటల్లోనూ అతిథిగా కనిపించింది. ఈమెది ఇంకా చిన్న వయసే. కాబట్టి హీరోయిన్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.

మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పటికే హీరోగా తొలి సినిమా చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తీయబోయే కొత్త సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడని టాక్. రమశ్ బాబు కుమార్తె భారతి కూడా నటి అయ్యేందుకు ఆసక్తి ఉందని తెలుస్తోంది.
తాజాగా మహేశ్ సోదరి మంజుల కూడా తన కూతురు జాన్వి.. త్వరలో సినిమాల్లోకి రానుందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈమె కూడా త్వరలోనే హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు సుధీర్ బాబు కూడా తన కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని చాన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే పెద్ద కొడుకు చరిత్ మాసస్.. ఇప్పటికే అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటుండగా.. చిన్న కొడుకు దర్శన్ కూడా 'ఫౌజీ'లో యంగ్ ప్రభాస్‌గా కనిపించబోతున్నాడని టాక్.
పైన చెప్పిన లిస్ట్ చూస్తే ఒకరిద్దరూ కాదు ఏకంగా ఏడుగురు వారసులు.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారనమాట. మరి వీళ్లలో ఎవరు ఎప్పుడొస్తారు? ఎవరు నిలదొక్కుకుంటారనేది చూడాలి?
(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్)



