
ప్రస్తుతం దర్శక నిర్మాతలందరూ పాన్ ఇండియా సినిమాలు వెంటపడుతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుధ్, తమన్, దేవి శ్రీ ప్రసాద్ వైపే చూస్తున్నారు. దాదాపు వీళ్లలో ఎవరో ఒకరు కావాలని పట్టుబడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఓ క్రేజీ కాంబోలో తీస్తున్న ఓ పాన్ ఇండియా మూవీ కోసం మణిశర్మ కొడుక్కి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా?
టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. అప్పట్లో చిరంజీవి, మహేశ్ బాబుతో పాటు స్టార్ హీరోల సినిమాలకు ఈయన మ్యూజిక్ ఇచ్చారు. కానీ ట్రెండ్ మారడంతో ఈయనకు అవకాశాలు తగ్గిపోయాయి. మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ కూడా మ్యూజిక్ డైరెక్టరే. 2015 నుంచి ఆడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తున్నారు. ఛలో, భీష్మ చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అలా చిరంజీవితో 'భోళా శంకర్'కి మ్యూజిక్ ఇచ్చే అవకాశం దక్కింది.
(ఇదీ చదవండి: డేవిడ్ వార్నర్‌కి రాజమౌళి స్పెషల్ గిఫ్ట్)
కానీ 'భోళా..' పాటలు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ పెద్దగా ఇంప్రెసివ్‌గా లేకపోవడం, మూవీ కూడా ఫ్లాప్ కావడంతో మహతికి తర్వాత పెద్ద ప్రాజెక్టులేం రాలేదు. అలాంటిది ఇప్పుడు పూరీ-విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కోసం మహతి స్వరసాగర్‌ని తీసుకున్నారనే విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ త్వరలో దీనిపై క్లారిటీ రావొచ్చు. ఓ రకంగా చూస్తే మహతికి ఇది గోల్డెన్ ఛాన్సే. తన సంగీతంతో మెప్పిస్తే మాత్రం మంచి గుర్తింపు గ్యారంటీ.
పూరీ-సేతుపతి ప్రాజెక్ట్ విషయానికొస్తే ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. సంయుక్త హీరోయిన్‌గా చేస్తోంది. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిల్యూర్స్‌తో డీలా పడిన పూరీ జగన్నాథ్.. వీలైనంత వేగంగా సేతుపతి మూవీని పూర్తి చేసి డైరెక్టర్‌గా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అలానే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్)
