
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య తదితర సినిమాలని నిర్మించిన ప్రవీణ పరుచూరి.. దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. దాదాపు కొత్త నటీనటులతో తీసిన ఈ మూవీకి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ రూరల్ డ్రామా సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ)
కథేంటి?
కొత్తపల్లి అనే ఊరు. అప్పన్న(రవీంద్ర విజయ్) ఊరందరికీ అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఉంటాడు. ఇతడి దగ్గరే రామకృష్ణ(మనోజ్ చంద్ర) సహాయకుడిగా పనిచేస్తుంటాడు. అదే ఊరిలో ఉండే రెడ్డి(బెనర్జీ) మనవరాలు సావిత్రిని(మౌనిక) రామకృష్ణ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయించే రామకృష్ణ.. సావిత్రితో.. పక్క ఊరిలో డ్యాన్స్ చేయించాలని అనుకుంటాడు. అయితే నేరుగా ఆమెతో మాట్లాడే ధైర్యం లేక సావిత్రి ఇంట్లో పనిచేసే అందం(ఉషా) సాయం తీసుకుంటాడు. కానీ అనుకోని సంఘటనల వల్ల అందంని రామకృష్ణ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు అప్పన్న చనిపోతాడు. తర్వాత ఊరిలో జరిగిన పరిణామాలేంటి? చివరకు రామకృష్ణ సావిత్రి ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో తీసే మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య చిత్రాల్ని నిర్మించిన ప్రవీణ.. ఆ అనుభవంతో తొలిసారి దర్శకత్వం వహించిన సినిమాని కూడా అదే జానర్‌లో తీశారు. బిగినర్స్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ డిఫరెంట్ కథని డిఫరెంట్‌గానే ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.
కొత్తపల్లిలో అనే ఊరిలో అప్పులిచ్చి వడ్డీలు కట్టించుకునే అప్పన్న, రికార్డింగ్ డ్యాన్సులు కడుతూ అప్పన్న దగ్గర పనిచేసే హీరో రామకృష్ణ.. అతడి ప్రేమించి సావిత్రి, సావిత్రి వాళ్ల ఇంట్లో పనిచేసే అందం.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లేసరికి ఫస్టాప్ అయిపోతుంది. సరదా సరదాగా సాగిపోతూనే ఇంటర్వెల్‌కి చిన్న ట్విస్ట్ పడుతుంది. అప్పటివరకు సరదాగా సాగిన మూవీ కాస్త.. సెకండాఫ్‌కి వచ్చేసరికి దెయ్యం, దేవుడు అంటూ ఫిలాసఫీ వైపు మళ్లుతుంది.
'దేవుడంటే నిజమో అబద్ధమో కాదు ఓ నమ్మకం' అనే పాయింట్‌ని చెప్పిన విధానం బాగుంది. కాకపోతే అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే చాలావరకు నిజాయతీగా చేసిన ఓ మంచి ప్రయత్నంలా అనిపిస్తుంది. మొదట్లో నేచురల్‌గా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత జరిగే సీన్స్ కొన్ని మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే మాత్రం చూస్తున్న రెండు గంటల పాటు ఎంటర్‌టైన్ అవుతారు.
ఎవరెలా చేశారు?
మనోజ్ చంద్ర రామకృష్ణ పాత్రలో ఆకట్టుకున్నాడు. తెరపై అమాయకంగా కనిపిస్తూ అలరించాడు. సావిత్రిగా చేసిన మౌనిక కంటే అందంగా చేసిన ఉషాకు కాస్త ఎక్కువ స్కోప్ దొరికింది. కాకపోతే హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మిగిలిన పాత్రధారులు ఉన్నంతలో బాగానే చేశారు. వంక పెట్టడానికి ఏం లేదు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. మరీ గుర్తుంచుకునేలా ఉండవు కానీ బాగుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఫైనల్‌గా దర్శకురాలు కమ్ నిర్మాత ప్రవీణ గురించి చెప్పుకోవాలి. తను అనుకున్న స్టోరీని నిజాయతీగా చెప్పారు. కాకపోతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: పుష్ప విలన్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్.. స్పెషల్ ఏంటి?)