
ఇటీవల డ్యూడ్ సినిమా ప్రెస్మీట్లో ఓ మహిళా జర్నలిస్ట్.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan )పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మీరు హీరోలానే ఉండరు.. రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ హార్డ్ వర్కా లేదా అదృష్టమా అని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు పక్కనే ఉన్న సీనియర్ నటుడు శరత్ కుమార్ మంచి సమాధానమే ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఆ జర్నలిస్ట్పై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.
రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న హీరోని అలా అనడం కరెక్ట్ కాదంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా ఈ వివాదంపై తెలుగు హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) స్పందించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరస్తూ ప్రశ్నలు అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'కె ర్యాంప్'. దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. సదరు మహిళా జర్నలిస్ట్ మరోసారి ప్రదీప్ రంగనాథన్పై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చాడని చెప్పాలనుకున్నానని.. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్ చేస్తున్నారని ఆమె చెబుతూ.. ‘మీరేమంటారు?’ అని కిరణ్ని అడిగారు.
‘నన్ను అడగండి పర్లేదు. కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హీరోని అలా కించపరిచే ప్రశ్నలు అడగడం మంచిది కాదు. మీరు(మీడియా) నన్ను ఒక మాట అన్న పడతా. మనం మనం ఒకటి. కానీ పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్లను అలా కించపరచడం కరెక్ట్ కాదు. మీ లుక్స్ ఇలా ఉన్నాయని అడగడం చూసి నాకే చాలా బాధగా అనిపించింది. తప్పగా అనుకోకండి.. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి’ అని సదరు మహిళా జర్నలిస్టుకు కిరణ్ విజ్ఞప్తి చేశారు.