
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త సంజయ్‌కపూర్ ఆస్తి వివాదానికి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసింది. అయితే, ఇదే సమయంలో సుమారు 30 ఏళ్ల క్రితం ఆమె నటించిన రాజా హిందుస్తానీ (Raja Hindustani) సినిమా గురించి మరోసారి ట్రెండ్ అవుతుంది. సినీ ప్రియులను మెప్పించిన ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్ (Aamir Khan) - కరిష్మా కపూర్ (Karisma Kapoor) జంటగా నటించారు. దర్శకుడు ధర్మేష్ దర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం 1996లో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

30 సెకన్ల కిస్ సీన్‌కు 47 టేకులు
రాజా హిందుస్తానీ చిత్రంలో ఆమిర్‌ఖాన్, కరిష్మా కపూర్ ముద్దు సీన్ ఒకటి ఉంటుంది. ఆరోజుల్లో అది పెద్ద సంచలనంగా మారిపోయింది. అయితే, ఆ సీన్ చిత్రీకరణలో చాలా ఇబ్బంది పడ్డానని కరిష్మా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మూడు రోజుల పాటు తాము పడిన కష్టం ఎవరికీ తెలయదని ఆమె అన్నారు. ఊటీలో గడ్డకట్టే చలి ఉండే సమయం ఫిబ్రవరి.. అలాంటి సమయంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ కొనసాగుతూ ఉండేది. తీవ్రమైన చలి కావడంతో తాము వణుకుతూనే ఉండేవాళ్ళమని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ ముద్దు సీన్ ఎప్పుడు పూర్తవుతుంది..? అంటూ ఎదురుచూసేవాళ్లమని కరిష్మా కపూర్ చెప్పారు.
ఫస్ట్ కిస్ సీన్ ఇదే
కరిష్మా కపూర్ గురించి ఆ చిత్ర దర్శకుడు ధర్మేష్ కూడా గతంలో పలు విషయాలు పంచుకున్నారు. ఆమిర్, కరిష్మాతో పని చేసిన రోజులను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. సినిమా పరిశ్రమలోకి ఆమె ఎంట్రీ ఇచ్చి అప్పటికి కొత్త... కథలో భాగంగా నటీనటుల మధ్య ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉందని ముందే కరిష్మాతో పాటు ఆమె తల్లికి కూడా చెప్పామన్నారు. అయితే, అప్పటికి ఆమె ఏ చిత్రంలోనూ కిస్ సీన్ చేయలేదని ఆయన గుర్తుచేశారు. దీంతో ఆమె కాస్త కంగారు పడినట్లు కూడా పేర్కొన్నాడు. ఆమెకు ధైర్యంగా ఉండేందుకు తన అమ్మగారిని సెట్స్‌లో ఉంచామన్నారు. ఏకంగా మూడురోజుల పాటు ఆ లిప్‌లాక్ సీన్ కోసం షూట్ చేశామన్నారు. అందుకోసం ఏకంగా దాదాపు 47 రీటేక్స్ తీసుకున్నట్లు దర్శకుడు గుర్తుచేసుకున్నారు. ఆరోజుల్లో లిప్‌లాక్ సీన్స్ పెద్దగా ఉండేవి కాదు. దీంతో సినిమా విడుదలయ్యాక ఇదొక ఐకానిక్ కిస్ సీన్‌గా మారిపోయింది.
కరిష్మా కపూర్ భర్త సంజయ్ గుండెపోటుతు మరణించాకా ఆయనకున్న రూ.30 వేల కోట్ల ఆస్తిలో వాటా కోరుతూ కరిష్మా పిల్లలు సమైరా (20), కియాన్ (15) హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఇప్పటికే కరిష్మా పిల్లలకు రూ. 1900 కోట్లు అందాయని సంజయ్ రెండో భార్య ప్రియ వాదనలు ఉన్నాయి. తనకు కూడా పిల్లలు ఉన్నారని తాను ఆయనకు చట్టబద్ధమైన భార్యనని తెలిపింది. ఆమెకు (కరిష్మాకు) చాలాకాలం క్రితమే ఆయన విడాకులు ఇచ్చారని న్యాయస్థానంలో పేర్కొంది.