
‘‘స్టార్ అనే ట్యాగ్ మాకు నచ్చదు. మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం. మాతో కలిసి పని చేసిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ పాల్గొని, సందడి చేశారు. ఈ వేడుకలో ఈ ఖాన్ త్రయం వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
‘‘నాకు, ఆమిర్ ఖాన్‌కు సినీ నేపథ్యం ఉంది. కానీ షారుక్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఎదిగాడు’’ అని సల్మాన్ మాట్లాడగా, ఇదే విషయంపై షారుక్ స్పందించారు. ‘‘సల్మాన్, ఆమిర్‌ల కుటుంబ సభ్యుడిగా నన్ను నేను భావిస్తాను. ఈ విధంగా నాకు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్లే’’ అని షారుక్ చెప్పారు. అలాగే అభిమానులతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడమే స్టార్‌డమ్ అని కూడా షారుక్ తెలిపారు.
అది సాధ్యమే: సల్మాన్ ఖాన్
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్‌లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. మంచి కథ కుదిరితే ఆమిర్, షారుక్‌లతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని సల్మాన్ చెప్పారు. కానీ మా ముగ్గర్నీ భరించడం మేకర్స్‌కి సులభం కాదని సరదాగా అన్నారు సల్మాన్ ఖాన్.