గుల్మొహర్‌ రివ్యూ.. మనసును హత్తుకునే సినిమా | OTT: Gulmohar Movie Review in Telugu | Sakshi
Sakshi News home page

Gulmohar Movie Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కట్టిపడేసే సినిమా

Nov 30 2025 7:42 AM | Updated on Nov 30 2025 12:06 PM

OTT: Gulmohar Movie Review in Telugu

ఇల్లు అంటే కేవలం నాలుగు గదులు అంతేనా? కాదు, ఇల్లు అంటే కుటుంబంలో ఒక భాగం. కుటుంబసభ్యుల ప్రేమానురాగాలకు, అలకలకు, కోపతాపాలకు, రహస్యాలకు, విషాదాలకు.. ఇలా అన్నిరకాల జ్ఞాపకాలకు నిలువెత్తు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉన్న సొంతింటిని వీడాలంటే కన్నతల్లికే దూరమవుతున్నట్లు మనసు తల్లడిల్లుతుంది. అలా ఇంటి చుట్టూ తిరిగే కథ గుల్మొహర్‌.

అందరి ఇంటి కథ
మనోజ్‌ బాజ్‌పాయ్‌, షర్మిల ఠాగోర్‌, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన మూవీ గుల్మొహర్‌. రాహుల్‌ చిట్టెల, అర్పిత ముఖర్జీ ఇల్లు, అందులో ఉండే కుటుంబం గురించి కథ రాసుకున్నారు. చూడటానికి సింపుల్‌గా ఉన్నా కొన్ని సన్నివేశాలు మనసును కదిలిస్తాయి. కుసుమ్‌ బాత్రగా షర్మిల నటన ఆకట్టుకుంటుంది. అందరి ఇంట్లోలాగే తను కూడా ఇంటిపెద్దగా, నాయినమ్మగా పెత్తనం చెలాయిస్తుంటుంది. కానీ, తన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు.

కథ
అందరం కలిసికట్టుగా జీవించాలనుకునే వ్యక్తి అరుణ్‌ (మనోజ్‌ బాజ్‌పాయ్‌). కానీ అతడి కుమారుడు ఆది (సూరజ్‌ శర్మ) భార్యతో కలిసి విడిగా ఉండాలనుకుంటాడు. తండ్రి సాయం లేకుండా సొంతంగా తన కాళ్లపై నిలబడాలనుకుంటాడు. అది అరుణ్‌కు నచ్చదు. కుటుంబం ఎప్పుడూ ఒకేచోట ఉండాలన్నది అతడి విధానం. ఇంతలో అతడి తల్లి కుసుమ్‌ కూడా పుదుచ్చేరిలో ఇల్లు కొన్నానని, ఒక్కతే అక్కడ ఉండబోతున్నానని చెప్పి బాంబు పేలుస్తుంది. ఇది ఎవరికీ మింగుడు పడకపోయినా ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరు.

ఎలా ఉందంటే?
చేతి ఐదువేళ్లు ఒకేలా ఎలా ఉండవో.. ఇంట్లోని మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కొరిది ఒక్కో స్వభావం. దాన్ని సినిమాలో చాలా బాగా చూపించారు. (Gulmohar Movie Review) క్లైమాక్స్‌లో మనోజ్‌ తన నటనతో ఏడిపించేశాడు. ఆ ఇంట్లో చివరి హోలీ చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. అది చూశాక మన మనసులు కూడా కాస్త తేలికపడతాయి. అందర్నీ ఇంతలా మెప్పించిన ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement