
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాంతార చాప్టర్-1 పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.
అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ మూవీకి అడ్డంకులు ఎదురువుతున్నాయి. కేరళలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని ఎగ్జిబిటర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ సినిమాను కేరళలో రిలీజ్ చేస్తున్న సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో లాభాల వాటాపై డీల కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రిలీజైన మొదటి రెండు వారాలు లాభాల్లో 55 శాతం వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు పృథ్వీరాజ్ సుకుమారన్కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ నిరాకరించింది. దీంతో కేరళలో సినిమా ప్రదర్శనను నిలిపిస్తున్నట్లు యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనతో కాంతార ప్రీక్వెల్ వీక్షించాలనుకున్న మలయాళీలకు నిరాశే తప్పేలా లేదు.
మలయాళ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో రిలీజైనప్పుడు కేవలం 40 శాతం లాభాల వాటా మాత్రమే పొందుతున్నామని ఎగ్జిబిటర్ల యూనియన్ అధ్యక్షుడు విజయకుమార్ అన్నారు. మలయాళ చిత్ర నిర్మాతలకు అంత వాటా రానప్పుడు.. ఈ పంపిణీదారులు ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారి నుంచి ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోమని ఎగ్జిబిటర్ల యూనియన్ పేర్కొంది. కాగా.. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు.