Actress Anju: 17 ఏళ్లకే 50 ఏళ్ల స్టార్‌ హీరోతో పారిపోయి పెళ్లి.. చివరికి చచ్చినా ముఖం చూడనంటూ..

Kannada Actress Anju About Husband Tiger Prabhakaran - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించిన అంజు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు చేసింది. హీరోయిన్‌గానూ చేసిన ఆమె తర్వాత బోల్డ్‌ పాత్రల్లో ఎక్కువగా నటించింది. 17 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే తలకిందులు చేసింది. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయారు? వంటి కారణాల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.

'మా అమ్మ నేను ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్ను వెంటపెట్టుకుని ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ డైరెక్టర్‌ మహేంద్రన్‌ సర్‌ చూసి నన్ను సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టుగా తీసుకున్నాడు. అలా నా కెరీర్‌ మొదలైంది. ఇప్పుడు సీరియల్స్‌ చేస్తున్నాను. కానీ అమ్మానాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు నేను కన్నడ సినిమా చేయడానికి బెంగళూరు వెళ్లాను. అప్పుడు కన్నడ స్టార్‌ హీరో టైగర్‌ ప్రభాకర్‌ నన్ను చూసి ఇష్టపడ్డారు. నా ముందు పెళ్లి ప్రపోజల్‌ పెట్టారు. ఆయనకు అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టాడు.

అప్పుడు నా వయసు 17 ఏళ్లు మాత్రమే! నేనిప్పుడు పెళ్లికి రెడీగా లేనని చెప్పాను. అయినా సరే నా వెంటపడ్డాడు. దీంతో అమ్మానాన్నను అడిగి చెప్తానన్నాను. ప్రభాకర్‌ వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది.. అతడిని చూడగానే అమ్మానాన్న ఈ పెళ్లే వద్దన్నారు. కానీ వాళ్ల మాట వినకుండా ప్రభాకరనే కావాలంటూ ఇంట్లో చెప్పాపెట్టకుండా తన దగ్గరికి వెళ్లిపోయాను. తనను ఎంతో నమ్మాను. తీరా ఆయన ఇంటికి వెళ్లాక అప్పటికే ప్రభాకర్‌కు మూడు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నారని తెలిసింది. దాని గురించి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు చాలా బాధేసింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయాను.

పైగా నేను గర్భిణిని. అయినా సరే అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటికి వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే లాకర్‌లో పెట్టి ఒంటిచేత్తో తిరిగొచ్చేశాను. ఆ ఇంట్లో నుంచి వెళ్లేపోయేటప్పుడు ప్రభాకర్‌తో ఒక్కటే మాట చెప్పాను.. నన్ను చాలా బ్యాడ్‌ చేశావు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. ఇంకెన్నడూ ఈ ఇంటి గడప తొక్కను. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చివరిసారిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత చాలా కాలంపాటు డిప్రెషన్‌లో ఉండిపోయాను. నెమ్మదిగా దాని నుంచి తేరుకుని తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొనసాగుతున్నాను' అని చెప్పుకొచ్చింది అంజు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top