
మక్కల్‌నీది మయ్యం నేత , సినీ నటుడు కమలహాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తమిళంలో ప్రమాణస్వీకారం చేసి తమ భాషపై కమల్ మక్కువ చాటుకున్నారు. ఆయనతో పాటు తమిళనాడు నుంచి మరో ఐదుగురితో డిప్యూటీ చైర్ పర్సన్ హరివంశీ ప్రమాణస్వీకారం చేపించారు. ఒక భారతీయుడిగా తన విధిని నిర్వర్తిస్తానంటూ కమల్ కామెంట్ చేశారు.
గత లోక్ సభ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమల్‌కు రాజ్యసభ అవకాశాన్ని డీఎంకే కల్పించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్‌ఎంఎం(Makkal Needhi Maiam) పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి.
