
తమిళసినిమా: నటుడు కమల్‌హాసన్‌ను సినిమా ఎన్‌సైక్లోపీడియా అంటారు. ఇక్కడ ఆయనకు తెలియని విషయం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలోనూ కమ లహాసన్ ముందుంటారు. అపూర్వ సహోదర్‌గళ్ చిత్రంలో అప్పు పాత్ర సృష్టినే అందుకు ఒక ఉదాహరణ. కాగా ఆధునిక టెక్నాలజీని వాడుకోవడంలో దర్శకుడు శంకర్ కూడా దిట్టే. ఈయన దర్శకత్వంలో కమలహాసన్ నటించిన ఇండియన్ చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా దానికి ఒకేసారి రెండు సీక్వెల్స్‌ను రూపొందించడం విశేషం. లైకా ప్రొడక్షన్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం దాదాపు 5 ఏళ్లు పట్టింది. మొదట ఇండియన్ చిత్రానికి సీక్వెల్‌ను ప్రారంభించినా, కాలయాపన, వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఇండియన్ 2, 3 సీక్వెల్స్‌ను ఏకకాలంలో తెరకెక్కించారు దర్శకుడు శంకర్.
కాగా ఈ రెండు చిత్రాల షూటింగ్‌ను కమలహాసన్ పూర్తి చేశారు. దీని గురించి ఆయన ఒక భేటీలో తెలుపుతూ ఇండియన్ 2, 3(తెలుగులో భారతీయుడు 2,3) చిత్రాల షూటింగ్ పూర్తి అయ్యాందని, ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆ తరువాత సీక్వెల్ 3కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కాగా ఇందులో నటి కాజల్ అగర్వాల్, ప్రియ భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారన్నది గమనార్హం. ప్రస్తుతం తాను పార్లమెంట్ ఎన్నికల పనిలో ఉన్నానని, ఎన్నికలు పూర్తి అయిన తరువాత థగ్ లైఫ్ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుటికే కొంత భాగాన్ని పూర్తి చేసుకుంది.