హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ (Jurassic World Rebirth) మరో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 7500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో కూడా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టి సత్తా చాటింది. అయితే, గత చిత్రాల ప్రభావం వల్లే ఈ కలెక్షన్స్ వచ్చాయని, రీబర్త్ పేరుతో వచ్చిన ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు.

జురాసిక్ వరల్డ్: రీబర్త్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ మూవీ చూడాలంటే అదనంగా రూ. 399 చెల్లించాలని మొదట ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత దానిని రూ. 119కి తగ్గించారు. ఈ క్రమంలోనే తాజాగా జియోహాట్‌స్టార్ (JioHotstar)సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. జురాసిక్ వరల్డ్: రీబర్త్ చిత్రాన్ని ఉచితంగానే చూడొచ్చని తెలిపింది. నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని జియోహాట్‌స్టార్ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలను కూడా ‘జురాసిక్ పార్క్’ చిత్రాలు ఆకట్టుకున్నాయి. 2022లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్: డొమినియన్’కు సీక్వెల్‌గా ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ (Jurassic World Rebirth) పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. విజువల్స్‌తో పాటు కొన్ని థ్రిల్లింగ్‌కు గురిచేసే సీన్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదు. కథ మొత్తం సాగదీతగానే ఉంటుంది.


