ఈనెలలో బాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీల మరణాలు కలిచివేశాయి. వీటి నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం. 'జమత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నమరాఠీ నటుడు సచిన్ చంద్‌వాడే (25) తనువు చాలించాడు. ఇంట్లోనే ఊరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రస్తుతం జమత్ర 2, అసురవన్ అనే సిరీస్‌లు చేస్తున్న సచిన్.. మరోవైపు విప్రో పుణె బ్రాంచ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కారణం ఏంటో తెలీదు గానీ ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు.. సచిన్‌ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ధులే సిటీకి తీసుకెళ్లారు. అలా దాదాపు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి 24వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో తుదిశ్వాస విడిచాడు.
చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమున్న సచిన్.. అందుకు తగ్గట్లే ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం కూడా 'జమత్ర 2'లో తన పాత్ర గురించి పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడంతో సన్నిహితులు, సహ నటీనటులు షాక్ అవుతున్నారు.


