
బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఇషా కోపికర్ తెలుగులో చంద్రలేఖ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి ఆశ్చర్యపరిచేలా పలు వ్యాఖ్చలు చేసింది. 1998లో వారిద్దరూ కలిసి నటించిన చంద్రలేఖ సినిమా ఒక సంచలనం. ఇందులో లేఖ పాత్రలో ఇష కొప్పికర్ నటించింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను తాజాగా ఆమె పంచుకుంది.
'నాగార్జున గురించి ఈ విషయం చెబితే ఆయన అభిమానులు ఎవరూ నమ్మరు. చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో నన్ను నాగార్జున చాలాసార్లు చెంపదెబ్బ కొట్టాడు. తెలుగులో ఈ సినిమా రెండోది. ఇందులో నన్ను నాగార్జున కొట్టే సీన్ ఒకటుంది. కానీ, ఆయన నా చెంప మీద మెల్లిగా కొట్టడంతో ఆ సీన్ సరిగ్గా రాలేదు. షూటింగ్ సమయంలో సీన్ కరెక్ట్‌గా రాకపోతే నాకు నచ్చదు. దీంతో నిజంగానే బలంగా కొట్టమని నేనే నాగార్జునను కోరాను. అందుకు ఆయన ఒప్పుకోలేదు. బలవంతం చేయడంతో ఆయన తప్పని పరిస్థితిలో కొట్టాడు. అయితే, ఆ సీన్కు అవసరమైన కోపాన్ని నేను చూపించలేకపోయాను. అవుట్‌పుట్ సరిగ్గా రాలేదు. సీన్ కోసం కోపంగా కనిపించే ప్రయత్నంలో పలుమార్లు రీటేక్ తీసుకున్నాం. దీంతో నన్ను 14 సార్లు నాగార్జున చెంపదెబ్బ కొట్టారు.' అని ఆమె నవ్వుతూ చెప్పింది.
'చెంపదెబ్బలు తిన్న తర్వాత నా మొఖం వాచిపోయింది. ఆయన చేతి గుర్తులు నా మొఖంపై చాలా సమయం పాటు ఉండిపోయాయి. ఆ సమయంలో నాగార్జున కూడా చాలా బాధపడ్డారు. వెంటనే వచ్చి క్షమాపణ కూడా చెప్పారు. నేను వద్దని వారించాను. సీన్ కోసం నేను డిమాండ్ చేయడం వల్లనే కదా అలా చేశావ్..' అని ఆమె గుర్తుచేసుకుంది.
చంద్రలేఖ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు. ఇషా కోపికర్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఏకంగా 80కి పైగా చిత్రాల్లో నటించింది. చివరిగా అయలాన్లో కనిపించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బీజేపీలో క్రియాశీలంగా ఆమె ఉంది.