
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) డ్యూడ్ సినిమా యూనిట్‌పై దావా వేశారు. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Raganathan) హీరోగా నటించిన ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ చిత్రాన్ని దర్శకుడు కీర్తిశ్వరన్ తరెకెక్కించారు. అయితే, డ్యూడ్ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన 'పుదు నెల్లు పుధు నాతు' చిత్రంలోని 'కరుతమచ్చన్'(Karutha Machan song) పాటను ఉపయోగించారు. మూవీలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు పెళ్లి సమయంలో ఈ సాంగ్ రన్ అవుతుంది.
ఏదైనా ఒక పాత సినిమాకు సంబంధించి డైలాగ్స్, పాటలు వంటివి రీక్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఈ మధ్య చాలామంది మేకర్స్ అనుమతి లేకుండా తీసుకోవడంతోనే ఇలాంటి సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డ్యూడ్ మేకర్స్‌తో పాటు సోనీ మ్యూజిక్‌పై ఇళయరాజా దావా వేశారు.
గతంలో కూడా అజిత్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఇళయరాజా దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, తాము అనుమతి తీసుకున్న తర్వాతే సాంగ్స్‌ను ఉపయోగించుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్ అన్నారు. ఇప్పుడు డ్యూడ్ సినిమా పరంగా కూడా వారు మరోసారి చిక్కుల్లో పడ్డారు. డ్యూడ్ సినిమా విషయంలో దావా వేసేందుకు ఇళయరాజాకు కోర్టు అనుమతి ఇచ్చింది.