Idhe Maa Katha Review: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ

Idhe Maa Katha Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : ఇదే మా కథ
నటీనటులు :  శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ తదితరులు
నిర్మాణ సంస్థ :  శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ 
నిర్మాత : జీ మహేష్  
దర్శకత్వం : గురు పవన్‌ 
సంగీతం : సునీల్ కశ్యప్ 
సినిమాటోగ్రఫీ : రాంప్రసాద్
ఎడిటింగ్‌:  జునైద్ సిద్దిఖీ 
విడుదల తేది : అక్టోబర్‌ 2,2021

సుమంత్‌ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌ ముఖ్య పాత్రల్లో గురు పవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్‌ నిర్మించిన ఈ సినిమా శనివారం (అక్టొబర్‌ 2)న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఎందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..?
మహేంద్ర(శ్రీకాంత్‌) క్యాన్సర్‌ బారిన పడిన ఓ బైక్‌ రైడర్‌. తన చివరి లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం బైక్‌పై లడఖ్‌కి బయలుదేరుతాడు. లక్ష్మీ (భూమిక) సాధారణ గృహిణి. భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా ఆమె.. తన తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం భర్తను ఎదురించి లడఖ్‌కి బయలుదేరుతుంది. మరోవైపు యూట్యూబర్‌ కమ్‌ బైక్‌ రైడర్‌ అజయ్‌(సుమంత్‌ అశ్విన్‌) ఛాంపియన్ షిప్ సాధించాలని లడఖ్ బయలు దేరుతాడు. ప్రేమ పేరుతో మోసానికి గురైన మేఘన (తాన్యా హోప్) బైక్ రైడింగ్‌కి వెళ్తుంది. వీరంతా అనుకోకుండా మార్గమధ్యలో కలుసుకుంటారు. చావు, బతుకులతో పోరాడుతున్న మహేంద్ర.. బైక్‌పైనే లడఖ్‌కి ఎందుకు వెళ్తాడు?  అనుకోకుండా కలిసే ఈ నలుగురు బైక్‌ రైడర్స్‌ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నదే ‘ఇదే మా కథ’ స్టోరీ.  

ఎవరెలా చేశారంటే..
భగ్న ప్రేమికుడు మహేంద్ర పాత్రలో శ్రీకాంత్‌ అద్భుతంగా నటించాడు. సినిమా భారాన్ని మొత్తం తన భూజాన వేసుకొని నడిపించాడు. సాధారణ గృహిణి లక్ష్మీ పాత్రలో భూమిక ఒదిగిపోయింది. కుటుంభ బాధ్యతలు మోస్తూనే.. తండ్రి ఆశయం కోసం మోటార్ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధించే మహిళగా భూమిక తనదైన నటనతో మెప్పించింది. ఇక బైక్‌ రైడర్‌ అజయ్‌గా  సుమంత్‌ అశ్విన్ అదరగొట్టేశాడు. చాలా హూషారైన పాత్ర తనది. కొత్తలుక్‌తో చాలా కాన్ఫిడెన్స్‌గా నటించాడు. ఇక మేఘనగా తాన్యా హూప్‌ పర్వాలేదనిపించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. సప్తగిరి, పృథ్వీ, జబర్దస్త్ రాంప్రసాద్ తమదైన కామెడీతో నవ్వించారు. శ్రీకాంత్ అయ్యంగార్,సుబ్బరాజు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
నలుగురు బైక్‌ రైడర్స్‌ జీవితాలకు సంబంధించిన ఎమోషనల్‌ కథే ‘ఇదే మా కథ’మూవీ. నలుగురు వ్యక్తుల జీవితంతో చోటు చేసుకున్న సమస్యలు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎలా తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారనే నేపథ్యంలో కథ నడుస్తుంది. కంప్లీట్ రోడ్ జర్నీగా సాగే ఈ కథకి ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గురు పవన్. రొటీన్‌ కథే అయినప్పటికీ.. కథనాన్ని ఇంట్రెస్టింగ్‌ నడిపించాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి.  ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయం చెయ్యడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. నలుగురు కలిశాక కానీ సినిమాపై ఆసక్తి పెరగదు. మధ్యలో వచ్చే  సప్తగిరి, రాంప్రసాద్,  పృథ్వీ ల కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సప్తగరి పంచ్‌లు.. నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ కంటెంట్‌ని ఇంకా ఎలివేట్‌ చేసి ఉంటే ఈ మూవీ మరోస్థాయికి వెళ్లేది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సునీల్‌ కశ్యప్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భోచితంగా వస్తాయి.  సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్‌. బైక్‌ విన్యాసాలతో పాటు సానా సన్నివేశాలను బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top