బాలీవుడ్‌లో రెండు చిత్రాలకు సంబంధించిన రిలీజ్ అప్‌డేట్ అందింది. ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ఒకటి. రెండోది ‘చాంద్ మేరా దిల్’. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలుసుకుందాం.
⇒ వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ తౌరాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2026 జూన్ 5న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘‘ఈ సినిమాలో లవ్, డ్రామా, కామెడీ... ఇలా ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
⇒ లక్ష్య, అనన్యా పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్స్‌గా లక్ష్య, అనన్య నటిస్తున్నారు. వివేక్ సోని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.


