ఒకవైపు తెలుగు మరోవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయారు నేషనల్ క్రష్ రష్మిక(Rashmika). పుష్ప సినిమా తర్వాత ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. చేతిలో మూడు, నాలుగు పాన్ ఇండియా సినిమా ఉన్నాయి. అయినా కూడా లేడీ ఓరియెంటెండ్ ఫిల్మ్ ‘ది గర్ల్ఫ్రెండ్’కి ఓకే చెప్పింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం కోసం రష్మిక చాలా కష్టపడాల్సి వచ్చిందట. అంతేకాదు ముందుగా పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా రిలీజ్ తర్వాతే తన రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పిందట. ఈ విషయం స్వయంగా చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలేనియే చెప్పారు.
నేడు(అక్టోబర్ 25) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీరజ్ మాట్లాడుతూ..‘నా కెరీర్ మొత్తంలో పది సినిమాలు చేసినా అవి గుర్తుండిపోవాలి అనుకుంటాను. వాటిలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాను తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. రష్మికకు కథ వినిపించగానే వెంటనే ఓకే చెప్పేసింది. తర్వాత రెమ్యునరేషన్ కోసం తన మేనేజర్ని కలిసేందుకు ప్రయత్నించాడు.
ఆయన సరిగా స్పందించకపోవడంతో నేరుగా రష్మికనే కలిసి పారితోషికం గురించి అడిగాను. అప్పుడు ఆమే‘నాకు ఇప్పుడు ఏం ఇవ్వకండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా పారితోషికం ఇవ్వండి’ అని చెప్పింది. ఆమె చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక చాలా బిజీగా ఉంది. ఒకవైపు పుష్ప 2 షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు మా సినిమా కోసం టైం కేటాయించింది.
అర్థరాత్రి 2 గంటల వరకు పుష్ప 2 షూటింగ్ చేసుకొని.. ఉదయం 7 గంటలకల్లా మా సినిమా సెట్లో ఉండేది. రెండు, మూడు నెలల పాటు ఆమె సరిగ్గా నిద్రపోలేదు. ఓ సినిమా కోసం ఫారిన్ వెళ్లి..తెల్లవారుజామున 4 గంటలకల్లా హైదరాబాద్ వచ్చేది. డ్రెస్సింగ్ రూమ్‌లోనే కాసేపు రెస్ట్ తీసుకొని..ఉదయం 8 గంటలకల్లా సెట్స్లో ఉండేది. అలాంటి సపోర్ట్ మరెవరూ ఇవ్వలేరు అనిపించింది. రష్మిక లేకుంటే "ది గర్ల్ ఫ్రెండ్" సినిమానే లే లేదు’ అని ధీరజ్ ఎమోషనల్‌గా చెప్పారు.


