పాసవ్వాలా... ఫెయిలవ్వాలా... అంతా పైసల పైనే | EXAM web series streeming in Amazon Prime | Sakshi
Sakshi News home page

పాసవ్వాలా... ఫెయిలవ్వాలా... అంతా పైసల పైనే

May 21 2026 6:05 AM | Updated on May 21 2026 6:05 AM

EXAM web series streeming in Amazon Prime

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో ఎగ్జామ్‌ సిరీస్‌ ఒకటి. ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ సిరీస్‌ గురించి తెలుసుకుందాం.

ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కానీ ఇప్పటి పరిస్థితులలో చదువుకునేవారు తక్కువయ్యారు... చదువు కొనేవారు ఎక్కువయ్యారు. 

రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్‌ ‘ఎగ్జామ్‌’. ప్రైమ్‌ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్‌ అవుతున్న ఈ సిరీస్‌ 7 భాగాలతో లభ్యమవుతోంది. దాదాపుగా వాస్తవిక ఘటనలతో, చిన్నపాటి సినిమాటిక్‌ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సర్గుణమ్‌. 

ఈ సిరీస్‌ మొత్తం గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌ అని చెప్పవచ్చు.  కథాంశానికి వస్తే... తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డీఎస్‌పీ మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో మారుమల్లిని ఝాన్సీ కిడ్నాప్‌ చేసి తైకారాకు తాను డీఎస్‌పీగా వెళుతుంది. ఓ డీఎస్‌పీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్‌ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమాటిక్‌ లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు. 

కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతారు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్‌ చేసింది? స్టేషన్‌కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా? లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్‌లోనే చూడాలి. ఈ సిరీస్‌ మొత్తం అయిపోయాక మన విద్యా వ్యవస్థలో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్‌ అయినా పాసవ్వాలా... ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసల మీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాల్సిన సిరీస్‌ ఇది.  

– హరికృష్ణ ఇంటూరు 
 

Advertisement
 
Advertisement
Advertisement