
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ పెంపుదలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు 24వ తేదీ రాత్రి 9 గంటలకు రూ.800 రేట్లతో స్పెషల్ షోకు అనుమతిస్తూ హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ సీఎం రేవంత్ వద్దే ఉండటం గమనార్హం. పుష్ప–2 సినిమా వివాదం నేపథ్యంలో స్పెషల్ షోలకు అనుమతిచ్చేది లేదంటూ గతంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన ప్రకటనకు సంబంధించిన క్లిప్‌ను హరీశ్‌రావు తన పోస్ట్‌కు జత చేశారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా స్పెషల్ షోలకు ఎలా అనుమతి ఇస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే ‘యూ టర్న్’ అంటూ హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణలో టికెట్ ధరలు
తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈమేరకు జీవో కూడా విడుదలైంది. ఈ నెల 24న రాత్రి 9గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800 అని పేర్కొంది. సినిమా విడుదలరోజు ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరలను పెంచేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఏపీలో టికెట్ రూ.1,000
ఏపీలో 25న అర్ధరాత్రి 1గంటకు ఓజీ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. దాని టికెట్ ధర రూ.1,000 పెంచేసి అభిమానులకు షాకిచ్చింది. అయితే, మిగిలినరోజుల్లో ప్రస్తుతమున్న ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్‌లలో రూ.125 , మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా విడుదల తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ టికెట్ ధరల పెంపునకు అవకాశం కల్పించింది. గతంలో ఇంత భారీ ధర ఏ సినిమాకు అవకాశం కల్పించలేదు.
.@revanth_anumula
U TURN@RahulGandhi @INCIndia @INCTelangana pic.twitter.com/QcJPftqQpb— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2025