మత్తుపదార్థాల కేసులో కోలీవుడ్ నటులు శ్రీరామ్(శ్రీకాంత్), కృష్ణ బెయిల్‌పై ఇప్పటికే విడుదలయ్యారు. అయితే, తాజాగా వారిద్దరికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. ఈ ఏడాది జూన్‌లో మొదట ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి వద్ద మాదక ద్రవ్యాలు దొరికాయి. అతన్ని విచారిస్తే గనా దేశానికి చెందిన జాన్ అనే వ్యక్తి సరఫరా చేశాడని తేలడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఇదే కేసులో అన్నాడీఎంకే మాజీ నేత ప్రశాంత్‌తో పాటు సినీనటులు శ్రీరామ్, కృష్ణ మొదలైన వారిని అరెస్టు చేశారు.
అయితే, పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన శ్రీరామ్, కృష్ణ బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు సూచనతో విడుదలయ్యారు. కానీ, తాజాగా ప్రత్యేక కోర్టు అనుమతితో పుళల్ జైల్లో ఉన్న ప్రశాంత్, జవహర్, ప్రదీప్‌కుమార్‌లను ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న నటుడు శ్రీరామ్, 29న నటుడు కృష్ణ విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు పంపారు.

తప్పు చేశాను.. నా బిడ్డను చూసుకోవాలి
డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఇప్పటికే ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు అప్పట్లో న్యాయస్థానం పేర్కొంది.


