
అస్సాం బ్యూటీ కయాదు లోహర్ చిక్కుల్లో పడేలా ఉంది. డ్రాగన్ సినిమా విజయంతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ అయిపోయిన ఆమెకు ఈడీ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో సంచలనంరేపిన టాస్మాక్ కుంభకోణంలో పాల్గొన్న వారు నిర్వహించిన 'నైట్ పార్టీ'కి ఆమె వెల్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీలో ఆమె పాల్గొనేందుకు రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టాస్మాక్ కుంభకోణం విషయంలో తమిళనాడు వ్యాప్తంగా కొద్దిరోజులుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కయూదు లోహర్ పేరు తెరపైకి వచ్చింది.
టాస్మాక్ కుంభకోణంతో సంబంధం ఉన్న వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సమయంలో లోహర్ పేరు బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారు నిర్వహించిన నైట్ పార్టీలకు వచ్చినందుకుగాను నటికి రూ.35 లక్షలు చెల్లించినట్లు ఒప్పుకున్నారట. అందుకు సంబంధించిన అధారాలు కూడా అందించారట. తమిళనాడు మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త అక్కడి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ఆరోపణలపై కయాదు లోహర్ ఇంకా స్పందించలేదు.

రూ. 1000 కోట్ల స్కామ్
తమిళనాడులో సుమారు రూ. 1000 కోట్లకు పైగా మద్యం స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు విచారణకు ఎంట్రీ ఇచ్చారు. అయితే, టాస్మాక్ అధికారులు అందుకు సహకరించకపోవడంతో వారి ఇళ్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నటి కయాదు లోహర్ పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. చెన్నైలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రైవేటు మద్యం ఫ్యాక్టరీలు, ప్రభుత్వ ముఖ్య అధికారులు వంటి చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఆపై టాస్మాక్‌లో రూ.1000 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఈడీ తెలిపింది.
సినీ నిర్మాత నివాసంలో సోదాలు
ప్రముఖ సినీ నిర్మాత ఆకాష్ భాస్కరన్ ఇంట్లో కొద్దిరోజుల క్రితమే ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ స్కామ్‌లో సినిమా పరిశ్రమకు కూడా లింకులు ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న ఆకాష్ భాస్కరన్ సహాయ డెరెక్టరుగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. అలా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే, భాస్కరన్‌కు ఉదయనిధికి మధ్య మంచి స్నేహం ఉందని తమిళ మీడియా పేర్కొంటుంది.