
ప్రముఖ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ గౌరవ డాక్టరేటు పొందారు. చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ వేల్స్ ఇన్‌స్టిట్యూట్ తరపున ప్రదానం చేశారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న వేల్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 15వ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమలో అద్భుత విజయం సాధించిన శ్రీ గోకులం గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ ఎ.ఎం. గోపాలన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు వెట్రి మారన్‌కు గౌరవ డాక్టరేట్‌లను వారు ప్రదానం చేశారు. వడచెన్నై, అసురన్, విడుదలై, ఆడుకాలమ్,కాక్క ముట్టై వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనంతరం క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ అశ్విన్‌కు కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4,992 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్స్ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతా గణేశ్, రిజిస్ట్రారర్ డాక్టర్.పి.శరవణన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్.ఎం.భాస్కరన్, అసోసియేట్ ఛాన్సలర్ డాక్టర్.ఎ.జ్యోతి మురుగల్, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. గతంలొ ఇదే యూనివర్సిటీ నుంచి మెగా హీరో రామ్ చరణ్ కూడా గౌరవ డాక్టరేట్ పొందారు.