‘‘మనం ఒకే తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం వినోదం కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ, కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే ఇంటివరకూ క్యారీ అవుతుంది. అలాంటి సినిమా ఇది. నా కెరీర్‌లో చేసిన మూవీస్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఉత్తమ చిత్రం అని చెప్పగలను’’ అని దీక్షిత్ శెట్టి చెప్పారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.
ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ–‘‘దసరా’ చిత్రం తర్వాత రాహుల్ రవీంద్రన్‌గారు నన్ను సంప్రదించి, ‘ది గర్ల్ ఫ్రెండ్’లో విక్రమ్ పాత్రకి నేను సరిపోతానని చెప్పారు. రాహుల్‌గారికి ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్ పాత్ర చేయడం సులభం అయ్యింది. ఈ సినిమా కేవలం యువత కోసమే కాదు.. కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో రష్మికగారి నటన చూశాక ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి మరో నాయిక న్యాయం చేయలేదేమో? అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు తెరపై రష్మిక కనిపించరు.. ఆమె చేసిన భూమా పాత్ర మాత్రమే కనిపిస్తుంది.
రాహుల్ రవీంద్రన్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ టైమ్‌లో అల్లు అరవింద్‌గారు రషెస్ చూసి, పిలిస్తే వెళ్లాను. ఆయన నన్ను అభినందించి, తర్వాతి చిత్రానికి అడ్వాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. విద్య, ధీరజ్‌గార్లు మా యూనిట్‌కి కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం మా సినిమాకు హైలైట్ అవుతుంది. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవడం నాకు ఇష్టం. అందుకే తెలుగు భాషని కూడా నేర్చుకున్నాను. విక్రమ్ పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను.
బాగా నటిస్తే భాషతో సంబంధం లేకుండా ఆయా నటీనటులను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘దసరా’ చిత్రం నుంచి హీరో నానిగారితో నా అనుబంధం కొనసాగుతోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్, ట్రైలర్ బాగున్నాయంటూ ఆయన ప్రశంసించడం సంతోషం. ఇక నేను కన్నడలో నటించిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో ‘షబనా, కేజేక్యూ’ తో పాటు మరో సినిమాలో నటిస్తున్నా. కన్నడలో శివ రాజ్‌కుమార్‌గారితో కలిసి ఓ మూవీ చేస్తున్నా. మలయాళంలో నటించిన ‘ఏంజెల్ నెం.16’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాను’’ అని తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
