
‘‘మాది ఉమ్మడి కుటుంబం. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త.. ఇలా అందరి ప్రేమ నాకు తెలుసు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కొందరికి అమ్మానాన్నలు కూడా భారం అవుతున్నారు. వారిని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. అమ్మానాన్నల గొప్పదనం, ప్రేమ విలువలు చెప్పాలనే ‘షష్టిపూర్తి’ సినిమా తీశాను. మంచి భావోద్వేగాలతో పాటు ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యే అంశాలు ఉన్నాయి’’ అని దర్శకుడు పవన్ ప్రభ అన్నారు.
రూపేశ్ కుమార్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఆకాంక్షా సింగ్ హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పవన్ ప్రభ విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఫిట్టింగ్ మాస్టర్’ సినిమాకు డైరెక్షన్ టీమ్‌లో పని చేశాను. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో సినిమా అంటే ఏంటో నేర్చుకున్నాను. ఇక ‘షష్టిపూర్తి’ కథ రూపేశ్‌గారికి నచ్చడంతో నిర్మించారు. రూపేశ్, ఆకాంక్ష చక్కగా నటించారు.
స్ట్రిక్ట్ మదర్‌గా అర్చనగారు, జోవియల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తారు. ఈ సినిమాకి సంగీతం చాలా ముఖ్యం. అందుకే ఇళయారాజాగారే కావాలి అనుకున్నాను. రూపేష్‌గారి వల్ల ఆయన్ని కలిశాను. ఆయన ఒక ΄ాట కోసం ఎన్నో ట్యూన్లు ఇచ్చారు. ‘షష్టిపూర్తి’ వేడుక గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేశాను. నా తర్వాతి సినిమాని త్వరలోనే ప్రకటిస్తాను’’ అని తెలిపారు.