
ఇలియానా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు..ఇలా స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే పిల్లలు పుట్టడంతో గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇలియానా రీఎంట్రీ ఇస్తే బాగుండని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇలియానా(Ileana D'cruz). త్వరలోనే మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇస్తానని చెప్పింది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తల్లిగా పూర్తి సమయాన్ని నా ఇద్దరి పిల్లలకే కేటాయిస్తున్నాను. ఇప్పుడే సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అభిమానులు నన్ను ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోగలను. నటన అంటే నాకు కూడా ఇష్టమే. కానీ దానికంటే ముందు నా పిల్లల బాగోగులు చూసుకేనే బాధ్యత నాకుంది. అందుకే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. అయితే అది ఎప్పుడు, ఏ సినిమా అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేను. రీఎంట్రీ ఇచ్చే ముందు నేను మానసికంగానే కాకుండా శారీరకంగానూ కొన్ని మార్పులు చేసుకోవాలి. దానికి కొంత సమయం పడుతుంది’ అని ఇలియానా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఇలియానా వెండితెరపై మెరవనుందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, 2006లో దేవదాస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. చివరిగా 2018లో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా చేసింది. 2023లో మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకొని..అదే ఏడాది చివరిలో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఈ ఏడాది జులైలో రెండో కొడుకు పుట్టినట్లు ఇలియానా ప్రకటించింది.