
‘‘సాయి శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాక్షసుడు’(2019) సినిమా మంచి విజయం సాధించింది. వారి కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘కిష్కింధపురి’పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. మా సినిమా ఫైనల్ ఔట్‌పుట్ చూశాక ఆ అంచనాలను అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. ఒక సున్నితమైన కథతో, మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది’’ అని డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆ తర్వాత కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఓ సందర్భంలో నిర్మాత సాహుగారికి ‘కిష్కింధపురి’ కథ చెప్పాను.. ఆయనకి చాలా నచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస్‌గారు విని, బాగా ఎగై్జట్ అయ్యారు. ఈ సినిమా చేయడానికి అల్లు అరవింద్, బన్నీవాస్‌గార్లు కూడా ఒప్పుకున్నారు.
హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ‘కిష్కింధపురి’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ కథకి స్ఫూర్తి రామాయణం. 1989లో కథ మొదలవుతుంది. కథ, విజువల్, టెక్నికల్‌గా ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని శ్రీనివాస్‌గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు చేయని పాత్రలో అనుపమ కనిపిస్తారు. సాహు గారపాటిగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
చేతన్ భరద్వాజ్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా చిత్రంలో స్మోకింగ్, డ్రింకింగ్ సన్నివేశాలు ఉండవు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. నా తొలి సినిమాకి ద్వితీయ చిత్రానికి ఎక్కువ గ్యాప్ వచ్చింది.. అయితే ఇకపై ఆ గ్యాప్ రాకూడదని కోరుకుంటున్నా. నా తర్వాతి సినిమాకి రెండు మూడు కథలు
సిద్ధంగా ఉన్నాయి’’ అని చెప్పారు.