Sakshi News home page

Ambajipeta Marriage Band: అందుకే సుహాస్‌ రెండు సార్లు గుండు చేయించుకున్నాడు: నిర్మాత

Published Sat, Jan 27 2024 6:46 PM

Dheeraj Mogilineni Talk Aobut Ambajipeta Marriage Band Movie - Sakshi

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’సినిమా ట్రైలర్‌ చూసి ఇందులో కులాల గురించి డిస్కషన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఊరిలో జరిగే కథ కాబట్టి సహజంగా పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటాయి. అంతే గానీ ఒక కులాన్ని కించపరచడం గానీ మరో కులాన్ని గొప్పగా చూపించడం గానీ చేయలేదు’అని చిత్ర నిర్మాత ధీరజ్‌ మొగిలినేని అన్నారు. సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్‌ మిగిలినేని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ధీరజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు. 

► ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇది కామెడీ మూవీ అనుకున్నారు. పాటలు రిలీజ్ చేశాక ఇది లవ్ స్టోరీ కావొచ్చని అన్నారు. ట్రైలర్ చూశాక సీరియస్ సబ్జెక్ట్ అని రివీల్ అయ్యింది. సుహాస్ కలర్ ఫొటో లాంటి మూవీ చేశాడు. పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. తన నెక్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" అవ్వాలని సుహాస్ కోరుకున్నాడు. అలాగే ఎంతో కమిట్ మెంట్ తో కష్టపడి నటించాడు. సహాస్ పర్ ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో స్క్రీన్ మీద చూస్తారు. మేము కూడా అతన్ని ఒక సీరియస్ సబ్జెక్ట్ లోనే చూపించాలని అనుకున్నాం.

► మా సినిమా ద్వారా ఎలాంటి సందేశం చెప్పడం లేదు. ఇలా ఉండాలని సూచించడం లేదు. ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను అలాగే సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం. ఇది మంచీ ఇది చెడు..ఇలా మారిపోండి అని ప్రేక్షకులకు చెప్పాలని అనుకోవడం లేదు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో లవ్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సుహాస్ అక్క క్యారెక్టర్ లో స్కూల్ టీచర్ గా శరణ్య ప్రదీప్ నటించింది. ఆమెది కథలో ఒక కీ రోల్. కథలోని ప్రధాన భాగం ఆమె క్యారెక్టర్ చుట్టూ సాగుతుంది. శరణ్య క్యారెక్టర్ ద్వారా స్టోరీలోని కొన్ని అంశాలు చెప్పాం.

మేము కథ వినే టైమ్ కు సుహాస్ కలర్ ఫొటో రిలీజైంది, రైటర్ పద్మభూషణ్ షూటింగ్ జరుగుతోంది. కథ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ కు సుహాస్ అయితే యాప్ట్ అవుతాడు అని అనుకున్నాం. తను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. రెండు సార్లు గుండు చేసుకున్నాడు. కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ కోసం సుహాస్ గుండుతో కనిపించాలి. సహజంగా ఉండాలంటే విగ్ పెట్టుకోవద్దు. అయితే తొలిసారి గుండు చేయించుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలను మాత్రమే షూట్‌ చేశాం. జుట్టు పెరిగిన తర్వాత మరిన్ని సన్నివేశాలకు గుండుతో కావాల్సి వచ్చింది. దీంతో సుహాస్‌ వెంటనే రెండో సారి గుండు చేయించుకున్నాడు. సుహాస్ బిజీ ఆర్టిస్ట్. కలర్ ఫొటో తర్వాత హీరోగా ఓ పది మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. వాటి గురించి ఆలోచించకుండా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"లో గుండు చేసుకుని నటించారు. ఆయన కమిట్ మెంట్ కు మేము సర్ ప్రైజ్ అయ్యాం.

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ లో హీరోయిన్ గా పేరున్న వారిని తీసుకుంటే కమర్షియల్ ఫీల్ వస్తుందేమో అనుకుని కొత్త వాళ్ల కోసం ఆడిషన్ చేశాం. శివానీ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ కు వచ్చింది. అయితే ఆమె పర్ ఫార్మెన్స్ చూసి హీరోయిన్ గా తీసుకోవచ్చు అని డైరెక్టర్ అన్నారు. అలా మళ్లీ ఆమెను పిలిచి హీరోయిన్ క్యారెక్టర్ కు ఆడిషన్ చేశారు దుశ్యంత్. బాగా చేస్తుందనే కాన్ఫిడెన్స్ రావడంతో హీరోయిన్ గా తీసుకున్నాం. మేము అనుకున్నట్లే తన రోల్ బాగా ప్లే చేసింది.

గీతా ఆర్ట్స్ లో చాలా పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. మేము ఈ మూవీని డిజైన్ చేసిందే కొత్తదనం కనిపించాలని. గీతా ఆర్ట్స్ గుడ్ విల్ కాపాడేలా ఉంటూనే ఒక ఫ్రెష్ నెస్, కొత్త వాళ్లతో సినిమా చేశాం. శరణ్య క్యారెక్టర్ కు మరో పేరున్న నటిని తీసుకోవచ్చు కానీ కథలోని ఆ ఒరిజినాలిటీ కనిపించాలంటే సీనియర్స్ వద్దనే అనిపించింది. 

అల్లు అరవింద్ గారు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను చూసి సంతోషంతో మమ్మల్ని హగ్ చేసుకున్నారు. చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. సినిమా బాగా నచ్చడంతో రెండోసారి కూడా చూశారు.

మా సినిమాకు శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. తన సంగీతంతో మా సినిమా ఫీల్ ను రెట్టింపు చేశారు. దర్శకుడు దుశ్యంత్ కథతో పాటే డైలాగ్స్ రాసుకుంటాడు. ఆయన కథ, డైలాగ్స్ లో నేటివిటీ కనిపిస్తుంటుంది. దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా చేయరు. కానీ దుశ్యంత్ కథ చెప్పినంత బాగా మూవీని రూపొందించాడు. టెక్నికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం రశ్మిక మందన్నతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తున్నాం. ఈ సినిమా 40 శాతం షూటింగ్ చేశాం. ఈ ఏడాదే విడుదల చేస్తాం. మరో మూడు ప్రాజెక్ట్స్ రెడీ చేసుకుంటున్నాం. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాను.

Advertisement

తప్పక చదవండి

Advertisement