సినిమా పిచ్చితో నేవీ ఉద్యోగాన్ని వదిలేసిన నటుడు.. | Sakshi
Sakshi News home page

Dasarathi Narasimhan: నేవీ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు విలన్‌గా..

Published Wed, Feb 28 2024 12:02 PM

Dasarathi Narasimhan Quit Navy Post For Movies - Sakshi

సినిమా మీద పిచ్చితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చినవాళ్లను చాలామందినే చూశాం. తాజాగా నౌకాదళ ఉద్యోగిని కూడా సినిమా ఆకర్షితుణ్ని చేసేసింది. దాశరధి నరసింహన్‌ స్వతహాగా నేవీ ఉద్యోగి. చదువు పూర్తి అయిన తర్వాత కొన్నేళ్లపాటు నౌకలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించారు. తనకు నటన అంటే చాలా ఇష్టం. దీంతో మంచి ఉద్యోగాన్ని వదిలేసి నటుడవ్వాలనే కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు.

బ్యాడ్‌ బాయ్స్‌ టీమ్‌లో ఒకరిగా..
2016లో వెంకట్రావు దర్శకత్వం వహించిన 'చెన్నై 600028–2' చిత్రంలో బ్యాడ్‌ బాయ్స్‌ టీమ్‌లో ఒకరిగా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అరుణ్‌ రాజాకామరాజ్‌ వహించిన కణ చిత్రంలో కథానాయకుడికి స్నేహితుడిగా నటించారు. వైభవ్‌ హీరోగా నటించిన 'ఆర్కే నగర్‌', అధర్వ కథానాయకుడిగా నటించిన '100' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

ఇప్పుడు విలన్‌గా..
అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ప్రతి నాయకుడి స్థాయికి ఎదిగారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటించిన లాల్‌ సలామ్‌ చిత్రంలో విష్ణు విశాల్‌కు మిత్రుడిగా నటించిన దాశరధి ప్రస్తుతం అజిత్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న విడాముయర్చి చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన రణం చిత్రంలో వైభవ్‌కు ప్రతి నాయకుడిగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈయన శ్రమను, నటనా ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ అమైది తమిళ్‌ వర్సిటీ యూత్‌ ఐకాన్‌ అవార్డుతో గౌరవించడం విశేషం.

చదవండి: పెళ్లి చేసుకోనంటున్న హాట్ బ్యూటీ.. కారణమేంటో తెలుసా?

Advertisement
 
Advertisement