బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్-2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దురంధర్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో పార్ట్-2 కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ చిత్రంపై సౌత్ స్టార్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీని కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం కొనియాడారు. అద్బుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
కాంతార ఇమిటేషన్ కేసులో ఊరట..
అయితే గతంలో రణ్‌వీర్ సింగ్ కాంతార మూవీ దేవతను ఇమిటేట్ చేయడం వివాదానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్ వీర్ సింగ్ ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత తన ప్రవర్తనపై రణ్‌వీర్ క్షమాపణలు కూడా చెప్పారు. ప్రజల భక్తి, సెంటిమెంట్ కావడంతో రణ్‌వీర్ సింగ్ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కాగా.. చాముండి దేవత పాత్రలో రిషబ్ శెట్టి నటించారు.
అయితే దైవాంశమైన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్‌లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణ సరిపోదని.. ప్రత్యక్షంగా వచ్చి సారీ చెప్పాలని పిటిషన్‌లో కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు రణ్‌వీర్ సింగ్‌కు ఊరటనిచ్చింది. చాముండి ఆలయాన్ని సందర్శించి క్షమాపణ చెప్పాలంటూ రణ్‌వీర్ సింగ్‌ను ఆదేశించింది. ఫిర్యాదుదారుడు క్షమాపణ కోసం కోర్టుకు హాజరు కావాలని కోరితే.. అందుకు అంగీకరించాలని కోర్టు సూచించింది.
దీనిపై క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేస్తామని.. రణ్‌వీర్ సింగ్ త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని హీరో తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణ సమయంలో రణవీర్ సింగ్ తండ్రి హాజరయ్యారు. కోర్టు సూచనలతో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కోర్టులో క్షమాపణ చెప్పి.. చాముండి ఆలయాన్ని సందర్శించనున్నారు.
కాగా.. గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది.


